Begin typing your search above and press return to search.

కేసీఆరే లైట్ తీసుకుంటే జనాలెలా?

By:  Tupaki Desk   |   8 May 2019 5:07 AM GMT
కేసీఆరే లైట్ తీసుకుంటే జనాలెలా?
X
‘ప్రతి ఓటు కీలకమే.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలి.. టీఆర్ ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలింగ్ నిర్వహించాలి’.. ప్రతి ఎన్నికల వేళ కేసీఆర్ చేసే హితబోధ ఇదే. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఓటు ఆయుధాన్ని ఉపయోగించాలని ప్రతీ సమావేశంలోనూ కేసీఆర్ లెక్చర్ ఇస్తుంటారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ కేసీఆర్ ఓటేయలేదు.. ఇప్పుడదే విమర్శలకు దారితీస్తోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట జిల్లా చింతమడకకు వచ్చి మరీ ఓటేశారు. బాల్య మిత్రులను కలిశారు. ఇప్పుడు ఇదే చింతమడకలో పరిషత్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సోమవారం జరిగాయి. కానీ కేసీఆర్ హాజరు కాలేదు.. ఓటేయలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి..

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేరళ వెళ్లారని ఆ బిజీలోనే ఓటు హక్కును పరిషత్ ఎన్నికల్లో వినియోగించుకోలేదని టీఆర్ ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మాత్రం.. ‘ఒక సీఎంకే ఓటు హక్కు వేయాలన్న పట్టింపు లేదని.. ఇక ప్రజలెలా ఓటేస్తారంటూ’ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ నీతు చెప్పే కేసీఆర్ దాన్ని పాటించరా అంటూ విమర్శిస్తున్నారు.

ఏదీ ఏమైనా సమాజంలో ఓటు వేయడానికి బద్దకించే వారు ఎందరో ఉన్నారు. వారికి ఆదర్శంగా నిలవాల్సిన నేతలే ఇప్పుడు ఆ ఓటును లైట్ తీసుకోవడం గమనార్హం. ఇక ఈ బిజీ యుగంలో మిగతా వారిని ఓటేసి ఆదర్శంగా ఉండమని కోరే అవకాశం కూడా సదురు నేతలు కోల్పోతారు.