Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్.. కేసీఆర్ ప్రెస్ మీట్ ను మస్తుగా ఫాలో అవుతున్న తెలుగోళ్లు

By:  Tupaki Desk   |   20 April 2020 5:15 AM GMT
కొత్త ట్రెండ్.. కేసీఆర్ ప్రెస్ మీట్ ను మస్తుగా ఫాలో అవుతున్న తెలుగోళ్లు
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే.. రాష్ట్రాలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంటుంది. సారు మీడియాతో మాట్లాడతారన్నంతనే తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు ఏపీ ప్రజలు సైతం ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. కరోనా పుణ్యమా అని తరచూ మీడియాతో మాట్లాడుతున్న ఆయన.. తాను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనూ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే కరోనా మీద ప్రపంచ వ్యాప్తంగా ఏమవుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోందన్న అవాగాహన కల్పించే విషయంలో కేసీఆర్ మీడియా సమావేశం ప్రజలకు ఉపయోగపడుతోంది.

దీనికి తోడు టీవీల్లో వచ్చే సీరియల్స్ బంద్ కావటంతో.. కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నంతనే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతున్న పరిస్థితి. అది సాధ్యం కానోళ్లు మొబైళ్లలోనూ లైవ్ చూసేస్తున్నారు. తెలుగు నేల మీద లేని ఎంతోమంది తెలుగోళ్లు.. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు.. వేరే ఛానళ్లలో సినిమాలు వస్తున్నా.. మరే ప్రోగ్రాంలో ఉన్నా.. ఫాలో అవుతున్న తీరు అంతకంతకూ పెరుగుతోంది.
ఒకవిధంగా చెప్పాలంటే.. కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నంతనే దాన్ని ఫాలో కావటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లకు కొత్త అలవాటుగా మారింది. మిగిలిన వారికి భిన్నంగా తన ప్రెస్ మీట్ ను తక్కువలో తక్కువ గంట నుంచి గంటన్నరకు పైనే నిర్వహించటం.. తెలంగాణలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. ప్రపంచ స్థాయిలోనూ.. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు అంశాల్ని ప్రస్తావించటం కూడా కారణం.

ఒకసారి గుర్తు చేసుకుంటే కరోనా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కేసీఆర్ ప్రెస్ మీట్ లను వరుసగా చూస్తే.. ప్రతి మీడియా సమావేశంలోనూ ఏదో ఒక కొత్త ఆలోచన.. విధానాల్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. దీనికి తోడు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంతో ప్రతి ఒక్క తెలుగోడికి అంతో ఇంతో లింకు ఉండటంతో కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న ఉత్సుకత కూడా కారణంగా చెప్పొచ్చు. ఏమైనా.. కరోనా వేళ తెలుగోళ్ల ఆసక్తుల్లో కొత్త మార్పు వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పక తప్పదు.