Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ఏమైంది? స్టేజ్ ఏర్పాటు చేసినా స్పీచ్ ఇవ్వట్లేదే?

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:34 AM GMT
కేటీఆర్ కు ఏమైంది? స్టేజ్ ఏర్పాటు చేసినా స్పీచ్ ఇవ్వట్లేదే?
X
గ్రాండ్ గా ఒక పథకాన్ని అమలు చేస్తూ.. దాని దగ్గరే పెద్ద వేదిక ఒకటి ఏర్పాటు చేయటమే కాదు.. ఆ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యత కు తగ్గట్లే భారీ ఎత్తున ఫ్లెక్సీలు.. కటౌట్లు ఏర్పాటు చేసినప్పటికీ.. మైకు ముందుకు వచ్చి మాట్లాడకుండా ఉండటం దేనికి నిదర్శనం? తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ తీరులో కొట్టొచ్చిన రీతి లో మార్పు కనిపిస్తోంది. తాము చేసే పావలా పనికి రూపాయి పావలా ప్రచారం చేసుకునే తీరుకు భిన్నం గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.

వారం వ్యవధి లో హైదరాబాద్ లోని రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భం గా ఆ రెండింటి లోనూ ముఖ్యమైన పథకాల్ని అమలు చేశారు.ఇలాంటప్పుడు సాధారణం గా భారీ ఎత్తున స్పీచ్ ఇవ్వటం.. ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం లాంటివి చేస్తారు. అందుకు భిన్నంగా ఆయన మౌనంగా ఉండటమే కాదు.. మాట్లాడేందుకు మైకు ను సిద్దం గా ఉంచినా.. ఏమీ పట్టనట్లుగా ఉండటం కనిపిస్తోంది.

బాలానగర్ లో వందకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్థిదారులకు ఇచ్చారు. వీటి విలువ తక్కువలో తక్కువ రూ.30 నుంచి రూ.40 లక్షల మధ్య ఉంటాయని చెబుతున్నారు. మరింత ప్రయోజనం కలిగించేలా డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు మైలేజీ కోసం మాట్లాడతారు. కానీ.. కేటీఆర్ మాత్రం మౌనం గా ఉన్నారు. దీనికి కారణం ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తునచేస్తున్న సమ్మేనని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మైకు ముందుకు వచ్చి ఉపన్యాసం మొదలు పెడితే.. ఆర్టీసీ కార్మికులు కానీ సమ్మె విషయంలో సానుకూలంగా ఉన్న వారు కానీ నిలదీస్తే లేనిపోని తలనొప్పిగా భావించి.. ఆ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉండే ఆయన ఇటీవల కాలంలో ట్వీట్ అన్నది చేయట్లేదు. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే.. సమ్మె విషయం మీద మాట్లాడాల్సి ఉంటుందని.. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా ట్వీట్ పిట్టకు సౌండ్ లేకుండా చేశారని చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా డీల్ చేసేలా మాట్లాడితే బాగుంటుందని.. ఇలా కామ్ గా ఉంటే నెగిటివ్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేటీఆర్ తన మౌనాన్ని ఎప్పటికి వీడతారో చూడాలి.