Begin typing your search above and press return to search.

ప్రతీ మగాడి విజయం వెనక ఆడవాళ్లకు అన్యాయం

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:30 AM GMT
ప్రతీ మగాడి విజయం వెనక ఆడవాళ్లకు అన్యాయం
X
ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు.. అది నిజమేనని చాలా సందర్భాల్లో నిరూపితమైంది.అయితే అదే ఆడవాళ్లు విద్య- ఉద్యోగాల్లో రాణించలేకపోవడానికి కారణం అదేనని తాజా పరిశోధనలో తేలింది. ఆడవాళ్ల ఏకాగ్రత దెబ్బతిని వారు ఉద్యోగాల్లో రాణించలేకపోవడానికి కారణమవుతోందని తేటతెల్లమైంది.

రెండు విభిన్నమైన పనులను ఒకే సమయంలో చేయడంతో వారి మెదడు దానిపై ఏకాగ్రత చూపించలేక ఫలితాలు బాగారావని తాజాగా జర్మనీ పరిశోధకులు తేల్చారు. ఇంట్లో వంటావార్పు చేసి పిల్లల ఆలనా పాలన చేసి భర్తకు, పిల్లలకు టిఫిన్లు పెట్టి వారిని సాగనంపి బండచాకిరీ చేశాక ఆఫీసుకెళ్లి ఉద్యోగాలు చేసే మహిళలు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారని జర్మనీకి చెందిన పరిశోధకుల బృందం తేల్చింది. ఈ సర్వేను తాజాగా ‘ప్లాస్ వన్’ అనే ఆంగ్ల వెబ్ సైట్ ప్రచురించింది.

జర్మనీ పరిశోధకులు తాజాగా 43మంది పురుషులు, 43మంది స్త్రీలను ఎంపిక చేసి వారికి ఒకే సమయంలో సంఖ్యలు- అంకెలను విశ్లేషించే పరీక్షలు పెట్టారు. ఒకే సమయంలో ఒకేపనిని, ఒకే సమయంలో రెండు రకాల పనులను చేయమని చెప్పారు. స్త్రీ పురుషులిద్దరికీ ఒకే ఫలితం వచ్చింది. ఏకకాలంలో రెండు పనులు చేసినప్పుడు మెరుగైన ఫలితాలు రాలేదని తేలింది. అంటే దీన్ని బట్టి ఉద్యోగాలు చేసే మహిళలు ఇంటిపనితో ఉద్యోగాల్లో రాణించలేరని పరిశోధకులు తేల్చారు. మగాళ్లకు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. మగాళ్లు రాణించడానికి ఇంట్లో పనిచేయకపోవడం.. మహిళలు వెనుకబడడానికి ఇంట్లో బండచాకిరీ చేయడమే కారణమన్నారు.

ఏకకాలంలో అనేక పనులు చేస్తే చేసే అసలు పనిపై సామర్థ్యం తగ్గుతుందట.. మన మెదడుకు ఏకకాలంలో బహు పనులు చేసే సామర్థ్యం లేదని తేలింది. ఈ విషయంలో ఆడమగకు ఎవరైనా ఒకే సమయంలో రెండు పనులు చేయలేరని తేలింది. అందుకే ఇంటి పని.. ఆఫీస్ పని చేసే మహిళల పనితీరు బాగా ఉండదని సర్వే తేల్చింది.