Begin typing your search above and press return to search.

లగడజగడం.. గందరగోళం.. ఈ సర్వే షాకేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 2:30 PM GMT
లగడజగడం.. గందరగోళం.. ఈ సర్వే షాకేనా?
X
ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన ప్రెస్ మీట్లలో చాలా జోష్ గా.. ఆనందంగా ఉత్సాహంగా కనిపించారు. కానీ ఎన్నికల తర్వాత చెప్పిన తన సర్వేలో మాత్రం ఒకింత ఆందోళన - గందరగోళం.., తికమక పడుతూ కనిపించాడు. ఆయన ఉన్నట్టే చెప్పిన సర్వే కూడా గందరగోళంగానే చెప్పేశాడు. ఎప్పుడూ లగడపాటి చెప్పే సరైన లెక్కలు తెలంగాణ ఎన్నికలపై మాత్రం క్లారిటీగా రాలేదు. ప్లస్ ఆర్ మైనస్ అంటూ కొత్త పదాన్ని తెచ్చి తానే ఎంత గందరగోళంలో ఉన్నాడో అందరికీ మీడియా ముఖంగా చూపించాడు.

లగడపాటి సర్వేలు ఎప్పుడు వాస్తవాని కి దగ్గర గా ఉంటాయి. అందుకే ఆయన సర్వేలకు విశ్వసనీయత ఎక్కువ. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 156 సీట్లు వస్తాయని.. 33 ఎంపీ సీట్లు వస్తాయని అంకెలతో సహా చెప్పిన లగడపాటి సర్వే ఆ సమయంలో నిజమైంది. ఆ తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో అందరూ వైసీపీ గెలుస్తుందంటే లగడపాటి మాత్రం టీడీపీ 30వేల మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. అన్నట్టే టీడీపీ 27వేల మెజార్టీతో గెలిచింది.

కానీ నాలుగు రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిదే అధికారం అని లగడపాటి జోస్యం చెప్పారు. ఇక ఎన్నికల పూర్తయ్యాక సర్వే చెప్పడంలో మాత్రం తడబాటుకు గురయ్యారు. ఎప్పుడూ లేనిది ప్లస్ ఆర్ మైనస్ అంటూ కొత్త లెక్క చెప్పారు . చివరి రెండు రోజుల్లో తెలంగాణ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని.. ఆ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిందని చెప్పారు. ఇందు కోసం 11కు ముందు మరోమారు ప్రెస్ మీట్ నిర్వహించి కరెక్ట్ లెక్క చెబుతానన్నారు.

దీన్ని బట్టి లగడపాటి కొందరి మేలు కోసం తన సర్వేలను - విశ్వసనీయతను తాకట్టు పెట్టాడని టీఆర్ ఎస్ ముఖ్యనాయకులు ఆరోపిస్తున్నారు. బాబు - కాంగ్రెస్ మెప్పు కోసం చేసిన ఈ సర్వే శుద్ధ తప్పని.. 11న ఇదే తేలుతుందని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. లగడపాటి సర్వే తప్పు అయితే ఇక ఆయన తలెత్తుకోలేరని.. ఆ సర్వేలను జనం ఎవరూ నమ్మరని అంటున్నారు. కూటమి విజయం సాధిస్తుందని అబద్ధం చెబుతూ లగడపాటి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ ఎన్నికలపై ఖచ్చితంగా చెప్పలేక.. కక్కలేక మింగలేక లగడపాటి అబద్ధాలాడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.