Begin typing your search above and press return to search.

అద్వానీ ప‌ద‌వి అందుకే పోయింద‌ట‌!

By:  Tupaki Desk   |   16 July 2019 11:30 AM GMT
అద్వానీ ప‌ద‌వి అందుకే పోయింద‌ట‌!
X
వ్య‌క్తులు ముఖ్యం కాదు. పార్టీ.. పార్టీ సిద్ధాంత‌మే ముఖ్య‌మంటూ లెక్చ‌ర్లు చాలానే వింటాం. పార్టీ వేదిక‌ల మీద మాట్లాడే మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య పొంత‌న ఉండ‌ని ఈ వైనం చాలా పార్టీల్లో క‌నిపిస్తూ ఉంటుంది. కానీ.. మిగిలిన పార్టీల‌కు భిన్నం త‌మ పార్టీ అని గొప్ప‌లు చెప్పుకునే బీజేపీ.. గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యాల్ని పాఠాలుగా బోధిస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప‌ద‌వి పోయింది ఎందుకో తెలుసా? అంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇస్తున్న శిక్ష‌ణ‌లో పాఠంగా చెబుతున్నార‌ట‌. 2005లో పాకిస్తాన్ కు వెళ్లిన అద్వానీ జిన్నా స‌మాధిని సంద‌ర్శించిన సంద‌ర్భంగా ఆయ‌న్ను లౌకిక‌వాదిగా పేర్కొన‌టంపై సంఘ్ ప‌రివార్ తో స‌హా బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఇదే.. ఆయ‌న్ను పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించేలా చేసింద‌న్న వాద‌న వినిపించేది.

ఇదంతా నిజ‌మేన‌న్న విష‌యాన్ని తాజా శిక్ష‌ణ‌లో పాఠంగా చెబుతున్నార‌ట‌. పార్టీ.. దాని సిద్ధాంతాలే ముఖ్య‌మ‌ని.. పార్టీకి ఏ వ్య‌క్తి ముఖ్యం కాద‌న్న విష‌యం అద్వానీతో స‌హా.. ప‌లువురు నేత‌ల విష‌యంలో ఇప్ప‌టికే నిరూపిత‌మైంద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. గుజ‌రాత్ బీజేపీలో బ‌ల‌మైన నేత‌గా పేరున్న సీనియ‌ర్ నేత శంక‌ర్ సిన్హ వాఘేలా ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌ని.. అదే రీతిలో ఒక‌ప్పుడు యూపీలో తిరుగులేని నేత‌గా పేరున్న క‌ల్యాణ్ సింగ్‌.. పార్టీ లైన్ దాటిన త‌ర్వాత ఆయ‌న‌కున్న ప్రాభ‌వం ఏమైందో తెలుసు క‌దా? అని చెబుతున్నార‌ట‌. మ‌రి.. ఇన్ని నీతులు చెబుతున్న బీజేపీ పెద్ద‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే ఉండ‌కూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ చేస్తున్న రాజ‌కీయం కూడా బీజేపీకి కూడా అల‌వాటు లేదుగా? త‌మ ప్ర‌భుత్వం ప‌డిపోకుండా ఉండేందుకు ఒకే ఒక్క ఎంపీ అవ‌స‌ర‌మైనా కూడా ఎలాంటి ప్ర‌లోభాల‌కు గురి చేయ‌కుండా ప్ర‌భుత్వం కూలిపోతున్నా ప‌ట్టించుకోని ద‌శ నుంచి.. ప‌చ్చ‌గా ఉండే ప్ర‌భుత్వాల్ని కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్న వైనం మాటేమిటి? దీన్నేమంటారో?