Begin typing your search above and press return to search.

అపర కుబేరుడికి అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:42 AM GMT
అపర కుబేరుడికి అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ
X
అపరకుబేరుడు. ఆయన తలుచుకుంటే వేలాది కోట్ల రూపాయిలు పెట్టుబడులు భారత్ లోకి వస్తాయి. నిజానికి ఆయన భేటీ కావాలనుకోవాలే కానీ.. పెద్ద ఎత్తున దేశాలు.. దేశాధ్యక్షులు ఆయన రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి వ్యాపార దిగ్గజానికి తనను కలుసుకునే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోడీ. ఇంతకీ ఆ అపరకుబేరుడు ఎవరో కాదు.. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆన్ లైన్లో సామాన్లు బుక్ చేసుకునే ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ సీఈవో బెజోస్.

ప్రస్తుతం ఆయన భారత్ లో పర్యటిస్తున్నాడు. ప్రధాని మోడీని కలుసుకోవాలని ఆయన అనుకున్నా.. ప్రధాని మాత్రం ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం ఆసక్తికరంగా మారింది. ఈ కామర్స్ బిజినెస్ తో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఆయనకు చెందిన మీడియా సంస్థే వాషింగ్టన్ పోస్ట్. దానికి మోడీ టైమివ్వకపోవటానికి లింకేమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

అమెరికాలో పేరున్న మీడియా సంస్థల్లో వాషింగ్టన్ పోస్టు ఒకటి. అలాంటి ప్రముఖ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా తరచూ వార్తలు రావటంతో ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం భారత్ లోని మైనార్టీలు భయం.. భయంగా ఎదురుచేస్తున్నారంటూ వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఈ తరహాలో మోడీ మీద వ్యతిరేకతను తరచూ చాటే ఆ మీడియా సంస్థ.. కశ్మీర్ ఇష్యూలోనూ మోడీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. జమ్ముకశ్మీర్ లోని ప్రజలకు స్వేచ్ఛ లేదని రాసుకొచ్చారు.

ఇవన్నీ ప్రధాని మోడీకి కోపాన్ని కలుగజేసే అంశాలుగా చెబుతారు. ఈ కారణంతోనే అమెజాన్ సీఈవోకు టైమిచ్చేందుకు ప్రధాని సుముఖంగా లేరని చెప్పక తప్పదు. దీంతో పాటు.. అమెజాన్ కారణంగా తమ వ్యాపారాలు భారీగా నాశనమవుతాయని.. చిన్న.. మధ్యతరహా వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్ పుణ్యమా అని ఇప్పటికే తమ వ్యాపారాలు మూతపడే పరిస్థితికి వచ్చేసిందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.

ఇలాంటివేళ.. అమెజాన్ సీఈవోతో తాను భేటీ అయితే.. మైలేజీ కంటే కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతోనో బెజోస్ కు టైమివ్వలేదని చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో ఎలా తీసుకుంటారన్నది మరో ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన భారత్ పర్యటన సందర్భంగా మోడీని గుర్తు చేసేలా సంప్రదాయ దుస్తుల్ని ధరించటంతోపాటు.. బాపూ ఘాట్ తో పాటు పలు ప్రాంతాల్లో తిరిగి తనదైన శైలిలో ప్రజల కంట్లో పడే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.