Begin typing your search above and press return to search.

తమిళనాడు.. ఏపీ కి నవంబరు వర్షపు పోటు ఎందుకు?

By:  Tupaki Desk   |   19 Nov 2021 4:57 AM GMT
తమిళనాడు.. ఏపీ కి నవంబరు వర్షపు పోటు ఎందుకు?
X
దేశంలో మరెక్కడా లేని రీతిలో అటు తమిళనాడులోనూ.. ఇటు ఏపీలో భారీ వర్షాల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గడిచిన వారం.. పది రోజుల క్రితం తమిళనాడు తీవ్ర వర్షాల కారణంగా ఇబ్బందులకు గురైతే.. తాజాగా ఏపీలో అలాంటి పరిస్థితి నెలకొంది. అన్నింటికి మించి.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి.. తిరుమలలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దాదాపు పాతికేళ్ల క్రితం అంటే 1996 ప్రాంతంలో కురిసిన భారీ వర్షం తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద వర్షమన్న మాట వినిపిస్తోంది.

వర్షం కారణంగా తిరుపతి.. తిరుమలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం స్థానిక అధికారులు జారీ చేసిన హెచ్చరిక ఏమంటే.. తిరుపతి పట్టణ ప్రజలు ఎంతో అవసరమైతే తప్పించి.. బయటకు రావొద్దని.. ఎవరి ఇండ్లలో వారు ఉండాలని పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నవంబరులో తమిళనాడు.. ఏపీలలో వర్షాలు ఎందుకు ఎక్కువగా పడుతుంటాయి? దీనికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తటం ఖాయం.

ఈ ప్రశ్నకు సమాదానం వెతికే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. భారీ వర్షాలకు కారణం వాతావరణంలో చోటు చేసుకునే విచిత్రమైన పరిస్థితులుగా చెబుతారు. అవేమంటే.. దేశంలోకి మే చివరి రోజుల నుంచి జూన్ మొదటి వారానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

అండమాన్ నుంచి మొదలయ్యే ఈ రుతుపవనాలు అటు కేరళతో పాటు.. ఇటు తమిళనాడు నుంచి ఎంట్రీ ఇస్తూ విస్తరించుకుంటూ దేశ వ్యాప్తంగా పాకుతాయి. దీంతో.. వర్షాలు కురుస్తాయి. ఎంట్రీ ఇచ్చే తమిళనాడు తీర ప్రాంతంతో పాటు ఏపీలోని చిత్తూరులోని తూర్పు ప్రాంతాలు.. నెల్లూరు జిల్లా మీదా ఈ రుతుపవనాల ప్రభావం పెద్దగా ఉండదు.

ఈ నైరుతి రుతుపవనాలు అలా విస్తరించుకుంటూ వెళ్లి.. హిమాలయాల వరకు వెళతాయి. అక్కడ నుంచి ముందుకు వెళ్లలేక మళ్లీ వెనక్కి వస్తాయి. అయితే.. వెళ్లిన దారిలో కాకుండా బంగాళాఖాతం మీదుగా పయనిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలుగా కూడా పలువురు అభివర్ణిస్తుంటారు. ఈ ప్రభావంతో అప్పుడప్పుడు వాయిగుండాలు.. అల్పపీడనాలు ఏర్పడతాయి. దీంతో చిత్తూరు జిల్లాలో కురిసే వర్షాలు భారీ వర్షాలుగా నమోదవుతుంటాయి.

ఫలితంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అలా అని ప్రతి ఏటా భారీ వర్షాలు కురవవు కానీ.. ప్రతి మూడు.. నాలుగేళ్లకు ఒకసారి మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు పడుతుంటాయి. తాజాగా మాత్రం అంతుకు మించి అన్న రీతిలో వర్షాలు కురుస్తుండటంతో తిరుపతి.. తిరుమల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.