Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఎవరికి నచ్చడం లేదెందుకు?

By:  Tupaki Desk   |   23 Oct 2019 7:19 AM GMT
రేవంత్ రెడ్డి ఎవరికి నచ్చడం లేదెందుకు?
X
ప్రగతి భవన్ ముట్టడి పేరుతో టీ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమం హిట్ అవుతుందని అంచనా వేయడం వల్లే కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు కూడా విధించింది. ప్రగతి భవన్ మెట్రోను మూసివేసింది.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. దీంతో జనం నానా అవస్థలు పడ్డారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడం కోసం ప్రభుత్వం కూడా కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసింది.. ప్రగతి భవన్ వైపు వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. మొత్తానికి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఇంతలా సక్సెస్ కావడం ఇదే కావడంతో ఆ పార్టీ సహజంగా ఖుషీగా ఉండాలి. కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు.. కారణం ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం క్రెడిట్ మొత్తాన్ని రేవంత్ రెడ్డి కొట్టేయడమే.

ప్రగతి భవన్ ముట్టడి రోజున రేవంత్ రెడ్డి చేసిన హడావుడి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మీడియాలో - సోషల్ మీడియాలో ఆయనకు దక్కినంత పబ్లిసిటీ ఇంకే కాంగ్రెస్ లీడర్‌ కూ దక్కలేదు. మిగతా లీడర్లను హౌస్ అరెస్టు చేయడానికి వెళ్లినట్లే రేవంత్ ఇంటికీ పోలీసులు వెళ్లేటప్పటికే ఆయన అక్కడ లేకపోవడం.. రేవంత్ ఎక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోవడం.. అజ్ఞాతంలో ఉంటూనే ట్విటర్ ద్వారా కేసీఆర్‌ కు వార్నింగ్ ఇవ్వడం.. చివరకు ఆయన పోలీసుల కళ్లుగప్పి బుల్లెట్ మీద ప్రగతి భవన్ కు రావడం.. వంటివన్నీ హైడ్రామా సృష్టించడమే కాదు రేవంత్‌ ను హీరోగా మార్చేశాయి. అయితే, మిగతా కాంగ్రెస్ నేతలకు ఈ పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదట... మొత్తం క్రెడిట్ అంతా రేవంతే కొట్టేశాడని వారు తెగ బాధపడుతున్నారట.

మరోవైపు చలో ప్రగతి భవన్ కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వడంతో చేపట్టిందే. అయితే, సీనియర్లను ఎవరినీ కాంటాక్టు చేయకుండానే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. దీంతో కొందరు సీనియర్లు పార్టీ కంటే వ్యక్తులు పెద్దోళ్లయిపోతున్నారంటూ మండిపడుతున్నారు. మల్లు భట్టివిక్రమార్క - మధుయాష్కీ - వీహెచ్ - కోదండ రెడ్డి వంటివారు తాము పేపర్లలో చూసి తెలుసుకున్నామని అంటున్నారు. ఆర్టీసీ యూనియన్లతో కలిపి ఈ కార్యక్రమం చేపడితే బాగుండేదని అంటున్నారు. మొత్తానికి ఇదంతా ఎలా ఉన్నా రేవంత్ మాత్రం ఈ దెబ్బతో మరోసారి హీరో అయ్యాడు.