Begin typing your search above and press return to search.

సిగరెట్ డబ్బాపై ఉన్న హెచ్చరిక గంగా నీళ్లకు ఎందుకు లేదు?

By:  Tupaki Desk   |   28 July 2018 1:30 AM GMT
సిగరెట్ డబ్బాపై ఉన్న హెచ్చరిక గంగా నీళ్లకు ఎందుకు లేదు?
X

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాన‌స పుత్రిక అయిన గంగాన‌ది శుద్దీక‌ర‌ణపై అనూహ్య కామెంట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విష‌యంలో హాట్ కామెంట్లు చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగా నదిలో కాలుష్యం పెరిగిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా హరిద్వార్ నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావో మధ్య ఉన్న నది పూర్తిగా కలుషితమైపోయిందని, ఇవి తాగడానికి - స్నానం చేయడానికి పనికిరావని ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. ఆ విషయం తెలియక అమాయక ప్రజలు వాటిని తాగి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సంద‌ర్బంగా కీల‌క‌మైన ప‌లు హెచ్చ‌రిక‌లు చేసింది.

గంగా న‌దీ శుద్ధీక‌ర‌ణ‌పై ట్రిబ్యున‌ల్‌ స్పందిస్తూ నిర్ల‌క్ష్యాన్ని త‌ప్పుప‌ట్టారు. ``గంగా నదిపై ఉన్న భక్తి - గౌరవం కారణంగా అమాయక ప్రజలు ఆ నీటిని తాగుతున్నారు. వాటితో స్నానం చేస్తున్నారు. కానీ ఆ నీళ్లు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలియదు. సిగరెట్ ప్యాక్‌ ల మీద ఆరోగ్యానికి ప్రమాదకరం అని హెచ్చరికలు రాస్తున్నపుడు గంగా నది నీళ్ల వల్ల కలిగే అనర్థాలను ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు?`` అంటూ ట్రిబ్యునల్ సంచ‌ల‌న కామెంట్లు చేసింది. ``గంగా నది నీళ్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం అక్కడి ప్రజల హక్కు`` అని ఎన్‌ జీటీ చైర్‌ పర్సన్ ఏకే గోయల్ స్పష్టంచేశారు. ప్రతి వంద కిలోమీటర్లకోసారి అక్కడి నీళ్లు తాగడానికి - స్నానం చేయడానికి మంచివా కాదా చెబుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాను ఎన్‌ జీటీ ఆదేశించింది. రెండు వారాల్లోగా ఎన్ ఎంసీజీతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తమ వెబ్‌ సైట్‌ లో గంగా నీళ్లు ఎక్కడెక్కడ తాగడానికి - స్నానానికి పనికివస్తాయో ఆ ప్రదేశాలను గుర్తించి పెట్టాలని స్పష్టంచేసింది.

కాగా, గ‌త ఏడాది గంగాన‌దికి విశిష్ట గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ప‌విత్ర గంగా న‌దికి ఇక ఓ మ‌నిషి హోదా ల‌భించింది. భార‌త నాగ‌రిక‌త గంగ‌తోనే మొద‌లైంద‌ని - దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి (Living Entity) గంగేన‌ని ఉత్త‌రాఖండ్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. గంగ‌తోపాటు దాని ఉప‌న‌ది య‌మున‌కు కూడా ఈ హోదా ల‌భించింది. ఈ హోదా వ‌ల్ల న‌మామి గంగా పేరుతో జ‌రుగుతున్న గంగా ప్ర‌క్షాళ‌న ప్రాజెక్ట్‌ కు మ‌రింత ప్రాధాన్య‌త ద‌క్క‌నుంది. త‌మ తీర్పు సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నంలోని న్యాయ‌మూర్తులు రాజీవ్ శ‌ర్మ‌ - అలోక్ సింగ్.. న్యూజిలాండ్‌ లోని వాంగ‌నుయ్ న‌దికి ఇలాంటి హోదానే ల‌భించింద‌ని గుర్తుచేశారు. ఇక ఈ న‌దుల బాగోగుల‌ను చూసుకోవ‌డానికి ముగ్గురిని కోర్టు ప్ర‌త్యేకంగా నియ‌మించింది.