Begin typing your search above and press return to search.

వై నాట్... వైసీపీ 175/175 వర్సెస్ టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్

By:  Tupaki Desk   |   17 Nov 2022 2:30 PM GMT
వై నాట్... వైసీపీ 175/175 వర్సెస్ టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్
X
రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అన్నదే నేతల మాటగా ఉంటుంది. చివరి ఓటు వరకూ అదే ధీమా వారిలో కనిపిస్తుంది. వై నాట్ అంటూ బరిలోకి దూకుతారు. ఇక అతి విశ్వాసం అనాలా ఆత్మ విశ్వాసం అని సరిపెట్టుకోవాలా అన్నది తెలియదు కానీ జగన్ అయితే వై నాట్ 175కి 175 అని అంటున్నారు. బల్ల గుద్దుతున్నారు. నిజానికి ఇది అద్భుతం. ఇది జరగదని ఎవరూ చెప్పలేరు కానీ లేదు ఇలాగే జరుగుతుందని కూడా అనుకోవడానికీ ఏ కోశానా వీలు అసలు లేదు.

కానీ జగన్ గత కొంతకాలంగా చేస్తున్న ఈ రకమైన ప్రకటనల వల్ల విపక్ష శిబిరానికి ఆయన క్లవరం పుట్టించగలిగారు అని అంటున్నారు. ఏదో విధంగా నైతికంగా దెబ్బ తీయడమే ఈ నినాదం ఉద్దేశ్యం అని అన్న వారూ లేకపోలేదు. అంటే ఇది ఫక్తు రాజకీయ ఎత్తుగడగానే అంతా చూస్తున్నారు. రాజకీయాల్లో అసాధ్యం లేదు అన్న పాయింట్ ని పట్టుకుని జగన్ ఆడుతున్న మైండ్ గేం ఇది అని అంటున్న వారూ ఉన్నారు.

మరి జగన్ అలా వై నాట్ అంటే టీడీపీ కూడా చూస్తూ ఊరుకుంటుందా. ఆ పార్టీకి తెలియని ఎత్తులు ఉంటాయా అలాగే ఆ పార్టీ మైండ్ గేం లో ఏమన్నా వెనకబడి ఉందా. అందుకే టీడీపీ నుంచి కూడా వచ్చేది మా ప్రభుత్వమే అని గట్టిగా నినాదం వినిపిస్తోంది. ఆరు నూరు అయినా కూడా గెలిచేది మేమే అని కూడా అంటున్నారు. ఈసారి ఏపీకి అవసరమైన టీడీపీ కచ్చితంగా గెలవాలి, గెలుస్తామని ఆయన చెబుతున్నారు.

ఇక జగన్ నుంచి చూస్తే కుప్పంలోనే ఈసారి చంద్రబాబు ఓడతారు అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయగలిగారు. అది అసలు జరుగుతుందా అన్నది పక్కన పెడితే జరగాలని వైసీపీ కోరుకుంటోంది. ఆ విధంగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసి పెడుతోంది. అసలు వైసీపీ 175కి 175 సీట్లు అన్న నినాదానికి మూలమే కుప్పం సీటు. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ అధినాయకుడినే ఓడించి మూలన పెడితే ఇక టీడీపీ ఏముంటుంది దాని గెలుపునకు ఎక్కడ అవకాశం ఆస్కారం ఉంటుంది అన్నదే వైసీపీ మార్క్ స్ట్రాటజీ.

ఇది రాజకీయ చదరంగంలో పావులు కదపడం అన్న మాట. ఏకంగా రాజుకే గురి పెడితే మిగిలిన సైన్యం అంతా కూడా చిత్తు అని జగన్ ఎత్తు వేస్తున్నారు. అందుకే పదే పదే కుప్పం అంటున్నారు. ఆ విధంగా మనం గెలిచేస్తున్నాం. ఏపీ అంతా వైసీపీయే పరచుకుంటుంది అన్న మాట కూడా ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నారు. ఇపుడు టీడీపీ కూడా అదే స్లోగన్ తో జగన్ కి గురి పెడుతోంది.

తాజాగా చంద్రబాబు కర్నూల్ టూర్ లో ఇదే మాట అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాల్సిందే. రాష్ట్రం బాగుపడాలి అంటే కనుక తప్పకుండా టీడీపీ గెలిచి తీరాల్సిందే అన్నది బాగు బలమైన నినాదం. తన కోసం కాదు ఏపీ కోసమే టీడీపీ గెలుపు అని ఆయన జనాలకు ఇంజెక్ట్ చేస్తున్నారు. పైగా నాకు చివరి ఎన్నికలు ఇవే అని కూడా ఆయన చెబుతున్నారు

ఇలా జనాలతో పార్టీ జనాలతో ఎవరికి వారుగా జగన్ చంద్రబాబు మైండ్ గేం ఆడుతున్నారు అనే అంటున్నారు. ఏపీ రాజకీయాలలో తాము తప్ప ఎవరూ లేరు అన్నదే ఈ రెండు పార్టీలకు ఇద్దరు నేతలకు ఉన్న భావన అని అంటున్న వారు ఉన్నారు. ఏపీలో చూస్తే జనాలు ఏమనుకుంటున్నారు అన్నది ఎవరికీ పట్టడంలేదు, ప్రజా సమస్యల మీద కూడా ఆలోచన కంటే అధికారం మీదనే మోజు కనిపిస్తోంది అని అంటున్నారు.

వై నాట్ అంటూ నేతలే సవాల్ చేసుకుంటూంటే అపుడు జనాలు ఎందుకు వారి తీర్పు ఎందుకు అన్నదే ప్రజాస్వామ్య ప్రియుల మాట. అసలు ప్రజాస్వామ్యంలో మొత్తం సీట్లు గెలవడమేంటి అని అన్ని సీట్లూ ఒకే పార్టీకి వేయాలని అత్యాశ పడడం ఏటి అని కూడా నిందిస్తున్నారు. చంద్రబాబు సైతం తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రానికి ముడి పెట్టి ఎమోషనల్ గా జనాలను ఎగదోయాలని చూడడమేంటి అని అంటున్నారు.

ఏపీ వేరు, టీడీపీ వేరు. టీడీపీతోనే ఏపీ లేదు ఇది కదా ఎవరైనా క్లారిటీకి రావాల్సింది. కానీ టీడీపీతోనే ఏపీ అంటూ బాబు చేస్తున్న రాజకీయం మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇక బాబుకు లాస్ట్ చాన్స్ అయితే జనాలకు ఏమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తోంది.

ఏది ఎలా చూసినప్పటికీ వై నాట్ అన్నది రాజకీయాలలో ఉన్న వారు అనకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు అనాలి. తాము అనుకుంటే వై నాట్ అంటే రాజకీయాల్లో సంచలన మార్పులే వస్తాయని జనాలు చెబుతున్నారు. గతంలో అనేక సార్లు అది నిజమై రుజువు అయిందని కూడా అంటున్నారు. ఈసారి కూడా జనాభిప్రాయం నెగ్గుతుందని, వై నాట్ అని బాబు జగన్ లనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.