Begin typing your search above and press return to search.

చైనా ముస్లింల హక్కులపై పాక్ కు పెద్దన్న భారీ షాక్

By:  Tupaki Desk   |   28 Sep 2019 5:12 AM GMT
చైనా ముస్లింల హక్కులపై పాక్ కు పెద్దన్న భారీ షాక్
X
తన రాజకీయ ప్రయోజనాల కోసం అదే పనిగా భారత్ మీద పడే పాకిస్తాన్ కు భారీ షాక్ తగలమే కాదు.. దాయాది ద్వందబుద్ధిని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఉదంతం చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల ప్రతినిధుల సభ సాక్షిగా అమెరికా భారీ షాకిచ్చింది. కశ్మీర్ లోని ముస్లింలకు మానవ హక్కులు కరువయ్యాయంటూ పదే పదే ప్రస్తావించిన పాక్.. చైనాలో ముస్లింలపై సాగుతున్న నిర్బంధంపై పెదవి విప్పటం లేదెందుకు? అన్న సూటి ప్రశ్నను సంధించారు.

దక్షిణ.. మధ్య ఆసియా ప్రాంత వ్యవహారాలు చూసే అమెరికా తాత్కాలిక సహాయ కార్యదర్శి అలిస్ వెల్స్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పాక్ తీరును తుర్పార పట్టారు. కశ్మీరీల హక్కుల గురించి మాట్లాడే ఇమ్రాన్.. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని లక్షలాది ఉయ్ గుర్ ముస్లింలు.. టర్కిష్ భాష మాట్లాడే ముస్లింల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఉయ్ గుర్ ప్రావిన్స్ లోని 10 లక్షల మంది ముస్లింలను నిర్బంధంలో ఉంచటాన్ని ప్రశ్నించిన అమెరికా.. పాక్ ప్రధాని ఈ విషయం ఎందుకు పట్టటం లేదనటమే కాదు.. నిర్బంధించిన ముస్లింలపై పాక్ ఆందోళన చేయాలన్నారు. మానవ హక్కులపై కేవలం కశ్మీరీల గురించి మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లింలపై సాగుతున్న నిర్బంధాల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు.

తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు పాక్ కు ఇబ్బందికరంగా మారటమే కాదు.. దాయాది ఎజెండా ఎలాంటిదన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు. అంతేకాదు.. భారత్ - పాక్ మధ్యనున్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు సరిహద్దుల్లోని అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు పాక్ నిజాయితీగా తీసుకునే చర్యలే కీలకంగా ఆమె అభివర్ణించారు. ఉద్రిక్తతలు తగ్గేందుకు ఆమె పలు అంశాల్ని ప్రస్తావించారు.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కార్యాచరణకు అనుగుణంగా నడుచుకోవటంతో పాటు ఉగ్ర నేతలు హఫీజ్ సయిద్ మసూద్ మీద నిజాయితీగా చర్యలు తీసుకోవాలన్నారు. పాక్ పొరుగున 130 కోట్ల భారీ మార్కెట్ ఉన్నా.. దాన్ని సరిగా వినియోగించుకోవటం లేదని అమెరికా పేర్కొంది. ఇంతకాలం చైనాలో ముస్లింలు ఎదుర్కొంటున్న నిర్బందం గురించి బయటకు సమాచారం పొక్కని వేళ.. అంతర్జాతీయ వేదిక మీద అమెరికా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు పాక్ కు ఇబ్బందికరంగా మారటమే కాదు.. చైనాను ఇరకాటంలో పడేలా చేశాయని చెప్పక తప్పదు.