Begin typing your search above and press return to search.
పవన్ ఈ సీనియర్ ను అవమానించారా?
By: Tupaki Desk | 4 Aug 2018 4:53 PM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ సీనియర్ నేత - తెలంగాణకు చెందిన దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విషయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమవగా అది చివరి నిమిషంలో రద్దు అయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుండగా చివరి నిమిషంలో పవన్ మోత్కుపల్లికి మొహం చాటేశారు. ఇందుకు కారణం పవన్ కున్న లెక్కలేనని తెలుస్తోంది.
తెలుగుదేశం అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడి బహిష్కృతుడు అయిన మోత్కుపల్లి అనంతరం తన విమర్శల దూకుడును మరింత పెంచిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అధర్మ పోరాటంపై ధర్మ పోరాటాన్ని తిరుపతి నుంచి మొదలు పెట్టానని, దీన్ని కొనసాగిస్తానని తిరుమల వెంకన్న సాక్షిగా ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. దీంతో ఈ సీనియర్ నేత టీఆర్ ఎస్ గూటికి చేరుతారని భావించారు. కానీ కేసీఆర్ తరఫున ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆ చేరిక వాయిదా పడింది. దీంతో మోత్కుపల్లి రాజకీయ జర్నీపై సందేహాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో హఠాత్తుగా ఆయన జనసేన వైపు నజర్ వేశారు. పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే ఈ సమావేశం చివరి నిమిషంలో రద్దు అయింది. ఇందుకు మోత్కుపల్లి విషయంలో పవన్‌కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ కారణం అంటున్నారు. మోత్కుపల్లి చేరిక వల్ల పార్టీకి ప్రత్యేకంగా ఒనగూరే లాభం లేదని, కేవలం సీనియర్ నేతగా మాత్రమే ఉంటారని పలువురు పవన్‌తో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతల తరఫున వచ్చిన ఫీడ్ బ్యాక్‌తో పాటుగా ఇటీవలి కాలంలో తెలంగాణలో అధికార పార్టీకి చేరువగా ఉంటున్న జనసేనాని దీన్ని కొనసాగించేందుకే మోత్కుపల్లిని దూరం పెట్టారని అంటున్నారు. కాగా, ఆదివారం తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లపై ఆయన స్పందించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌తో మోత్కుపల్లి ఏం చెప్పానున్నారనేది ఆసక్తికరంగ మారింది.