Begin typing your search above and press return to search.

రోహిత్ రెడ్డి పేరు ముందు 'పైలెట్' ఎందుకు? ధర్మాసనం డౌట్

By:  Tupaki Desk   |   7 Jan 2023 4:47 AM GMT
రోహిత్ రెడ్డి పేరు ముందు పైలెట్ ఎందుకు? ధర్మాసనం డౌట్
X
ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ ఎంతటి సంచనాల్ని క్రియేట్ చేస్తుందన్నది తెలిసిందే. వ్యూహాల్ని రచించటం.. వాటిని అమలు చేసే విషయంలో తిరుగులేని తోపుగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి లెక్కల మాష్టారికి సైతం చుక్కలు చూపిస్తోంది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. తాను ఒకసారి లెక్కలు చేసి డిసైడ్ అయితే.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని రీతిలో ప్లాన్ చేసే కేసీఆర్ కు.. ఎమ్మెల్యేల ఎర కేసు కాస్తంత ఇబ్బందికరంగా మారింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ పదాన్ని తరచూ వాడే కేసీఆర్ సర్కారు.. రెండుసార్లు తాము అధికారంలోకి వచ్చిన వేళలో.. ఎంతమంది విపక్ష ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో చేర్చుకున్నారన్న దానిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనల్ని వాడి వేడిగా చేపట్టారు.

ఈ క్రమంలో కీలకంగా మారి.. తరచూ తెర మీదకు వస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డికి సంబంధించి.. ఆయన పేరు ముందు పెట్టే పైలెట్ మాట అసలు ఎందుకు పెట్టినట్లు? ఆయన పేరు ముందు పైలెట్ అనే పదాన్ని అదే పనిగా ఎందుకు వాడుతున్నట్లు? అన్న సందేహం ధర్మాసనానికి కలిగింది.

తాజాగా జరుగుతున్న వాదనల నేపథ్యంలో ధర్మాసనం తనకు వచ్చిన సందేహాన్ని బయటకు వెల్లడించింది. ఇంతకీ రోహిత్ రెడ్డి పేరు ముందు పైలెట్ అన్న మాట ఎందుకు వచ్చింది? అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన న్యాయవాది దామోదర్ రెడ్డి సమాధానం ఇస్తూ.. ఆయన కొద్దికాలం పాటు పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పారు.

దీంతో స్పందించిన న్యాయమూర్తి.. 'ఆయన పైలట్ కాబట్టి అటూ ఇటూ వేగంగా దూసుకెళ్తుంటారేమో?' అంటూ సరదాగా చమత్కరించటంతో కోర్టు హాలులో నవ్వులు విరబూశాయి. మొత్తానికి చాలామందికి వచ్చే సందేహం హైకోర్టు జడ్జికి రావటం.. ఆయన పుణ్యమా అని పైలట్ పేరు వెనుకున్న అసలు కారణం తాజాగా వెల్లడైందని చెప్పాలి. ఏమైనా హాట్ హాట్ గా వాదనలు జరిగే వేళలో.. ఇలాంటి సరదా పరిణామాలు వాతావరణాన్ని కాస్తంత వేడిని తగ్గిస్తాయని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.