Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ కు థ్యాంక్స్.. శివసేన సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   9 Aug 2019 7:28 AM GMT
పాకిస్తాన్ కు థ్యాంక్స్.. శివసేన సర్ ప్రైజ్
X
ఎవరైనా చెడు చేసిన శత్రువుకు కృతజ్ఞతలు చెబుతారా? కానీ హిందుత్వ పార్టీ శివసేన చెప్పింది. అది అలాంటి ఇలాంటి శత్రువు కాదు.. ఏకంగా పాకిస్తాన్. పాకిస్తాన్ అంటేనే పడని శివసేన ఇప్పుడు ఆ దేశానికి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎందుకిలా చెప్పిందనే విషయం మాత్రం ఆసక్తికరంగా ఉంది.

ఆరునెలల కింద జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 46మంది భారత జవాన్లపై ఆత్మహుతి దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం భారత్ పాకిస్తాన్ భూభాగంపైకి వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాదుల పని పట్టేందుకు భారత్ రెడీ అయ్యింది.

అందులో భాగంగానే రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ కశ్మీర్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశారు. దాని స్వయంప్రతిపత్తి అయి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ తాజాగా భారత్ తో దౌత్య, వాణిజ్యాన్ని నిలిపివేసి తమ హైకమిషనర్ ను వెనక్కి పిలిపించింది. అంతేకాదు పుల్వామా లాంటి దాడులు మరిన్ని జరుగుతాయని తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.

ఈ పరిణామాలపై మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న బీజేపీ దోస్త్ పార్టీ ‘శివసేన’ తన సొంత పత్రిక ‘సామ్నా’లో స్పందించింది. ఇమ్రాన్ వ్యాఖ్యాలను బట్టి పుల్వామా దాడి వెనుక పాక్ హస్తం ఉందని అర్థమవుతోందని.. ఇదే సాక్ష్యమని స్పష్టం చేసింది. భారత్ తో వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవడంపై పాకిస్తాన్ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అని వ్యాఖ్యానించింది. వాణిజ్యంలో అసలు పాకిస్తాన్ కు ఏమాత్రం బలం లేదని.. దానివల్ల భారత్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.ఇక పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో పాక్ హైకమిషనర్ ఒక కీలుబొమ్మ అని వ్యాఖ్యానించింది. పుల్వామా దాడి చేసి పాకిస్తాన్ భారత్ కు మేలే చేసిందని.. ఇదే కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు కారణమైంది.. ఈ ఆలోచన పుట్టించినందుకు పాకిస్తాన్ కు కృతజ్ఞతలు అంటూ శివసేన ఎద్దేవా చేసింది. కశ్మీర్ పై పోరాటంలో భారత్ దే విజయమని..పాకిస్తాన్ కూడా ఒప్పుకోకతప్పదని శివసేన పాకిస్తాన్ కు నీతులు చెప్పింది.

ఇక పీవోకేకు భారత్ సొంతం అవుతుందని.. ఇస్లామాబాద్ లో వెలిసిన పోస్టర్లను బట్టి అఖండ భారత్ పాకిస్తాన్ తో కలిపి వాస్తవరూపం దాల్చుతుందని శివసేన సంచలన కామెంట్స్ చేసింది.