Begin typing your search above and press return to search.

గవర్నరైతే గొప్పేంటి.. సుప్రీం సీరియస్

By:  Tupaki Desk   |   8 July 2017 6:14 AM GMT
గవర్నరైతే గొప్పేంటి.. సుప్రీం సీరియస్
X
దేశంలో రాష్ర్టపతి, గవర్నరు పదవులకు ఉన్న ఉన్నత స్థానం కాదనలేనిది. కానీ.. అదేసమయంలో కొన్ని చట్టాల విషయానికి వచ్చేసరికి వారు కూడా అందరితో సమానమే. తాజాగా సుప్రీం కోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తంచేసింది. ఎంతో కీలకమైన సమాచార హక్కు చట్టం పరిధిలోకి గవర్నర్‌ కార్యాలయం రాకపోవడమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోవా గవర్నరు కార్యాలయం గతంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా - జస్టిస్‌ అమితావ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఈ దేశంలో ఎవరూ ఏ సమాచారాన్ని దాచేందుకు వీళ్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

2007లో గోవాలో రాజకీయ పరిస్థితిపై సమాచారమివ్వాలని అప్పటి ప్రతిపక్ష నేత మనోహర్‌ పారికర్‌ ఆర్‌ టిఐ చట్టం కింద గవర్నర్‌ ను కోరారు. అయితే ఆ సమాచారాన్నిచ్చేందుకు గవర్నర్‌ సమాచార కార్యాలయం నిరాకరించింది. గోవా సమాచార కమిషన్‌ ఆదేశాలను బేఖాతరు చేసింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కార్యాలయం సమాచారాన్ని విడుదల చేయాల్సిందేనంటూ హైకోర్టు 2011లో ఆదేశించింది.

ఆ ఆదేశాలను సవాలను చేస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ విచారణకు హాజరయ్యారు. ఆర్‌టిఐ చట్టం పరిధి నుంచి గవర్నర్‌ను ఎందుకు మినహాయించాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రంజిత్‌ కుమార్‌ స్పందిస్తూ దీని కంటే ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆస్తుల వెల్లడికి సంబంధించిన పిటిషన్‌ దాఖలైందని, ఈ రెండు పిటిషన్‌ లనూ కలిపి విచారించాలని కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తికి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండకూడదని వ్యాఖ్యానించింది.