Begin typing your search above and press return to search.

ఇందిర గొప్ప అయితే!..మోదీ ఎందుకు కాదు?

By:  Tupaki Desk   |   30 March 2019 2:28 PM GMT
ఇందిర గొప్ప అయితే!..మోదీ ఎందుకు కాదు?
X
ఎన్నిక‌లొచ్చాయి. మాది గొప్పంటే... మాదీ గొప్పేనంటూ అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌కు అనుకూల‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌కు లాగుతున్నాయి. అదే స‌మ‌యంలో త‌మను కార్న‌ర్ చేసే విష‌యాల జోలికి మాత్రం పార్టీలు వెళ్ల‌డం లేదు. అంతేకాదండోయ్‌.. మీరు చేసిన ఆ ప‌ని త‌ప్పంటే... కాదు మీరు చేసిన ప‌నే త‌ప్పంటూ ప‌ర‌స్ప‌ర నిందారోప‌ణ‌లు కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటి కీల‌క త‌రుణంలో ఇటీవ‌లే పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కూడా రంగంలోకి దిగేశాయి. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు నేటి త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా... మోదీ హ‌యాంలో జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ గురించి ప్ర‌స్తావించారు. యూపీఏ-1 టైంలో ఇప్ప‌టిలాగే పెద్ద ఎత్తున ఉగ్ర శిబిరాల‌పై భార‌త సైన్యం దాడులు జ‌రిపింద‌ని, అయితే వాటిని బ‌య‌ట‌పెట్టుకుని రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ సాహ‌సించ‌లేద‌ని కూడా ఆయ‌న సెల‌విచ్చారు. దేశ ర‌క్ష‌ణకు సంబంధించిన ఇలాంటి విషయాల‌ను బ‌య‌ట‌పెట్టుకుని జ‌బ్బ‌లు చ‌రుచుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇప్పుడు ఇదే విష‌యంపై జాతీయ పార్టీల మ‌ధ్య వార్ ఆఫ్ వ‌ర్డ్స్ చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా స‌ర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి తామెందుకు గొప్ప‌గా చెప్పుకోకూడ‌దో వివ‌రించాలంటూ బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు సంధించారు. నేటి ఉద‌యం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకునేందుకు గాంధీ న‌గ‌ర్ వ‌చ్చిన రాజ్ నాథ్ అక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మోదీ హ‌యాంలో జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు, దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌యాంలో పాకిస్థాన్‌పై జ‌రిగిన యుద్ధం - బంగ్లాదేశ్ విభ‌జ‌న అంశాల‌ను పోలుస్తూ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్‌ ను విడదీసి బంగ్లాదేశ్‌ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన ఘనతను ఇందిరా గాంధీకి ఆపాదించినప్పుడు.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఘనత నరేం‍ద్ర మోదీకి దక్కడంలో తప్పేంటని ఆయ‌న‌ ప్రశ్నించారు. 1971లో జరిగిన పాకిస్థాన్‌ యుద్ధంలో మన దేశం విజయం సాధించిందని... ఫలితంగా పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ ఘనత అంతా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీదే అంటూ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల కూడా అభినందించిన విష‌యాన్ని గుర్తు చేసిన రాజ్ నాథ్... ఈ యుద్ధం తర్వాత బీజేపీ నేత‌ వాజ్‌పేయి కూడా ఇందిరా గాంధీని పొగిడారని చెప్పారు. ఆమె నిర్ణయాన్ని దేశ ప్రజలంతా కొనియాడార‌ని కూడా రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.

అలాంటిది ఇప్పుడు ఉగ్రశిబిరాల మీద సైన్యం మెరుపు దాడులు చేస్తే... అందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చిన మోదీని అభినందిస్తే తప్పేంటని ఆయ‌న ప్రశ్నించారు. ముష్కరులు 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపేస్తే... ఇందుకు ప్రతీకారంగా మోదీ సైన్యానికి అన్ని అధికారాలు మంజూరు చేశారని ఆయ‌న అన్నారు. మన జవాన్ల మీద దాడి చేసిన ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేశామ‌ని... కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఎన్నికల జిమ్మిక్కుగా విమర్శించడం దారుణమ‌ని రాజ్ నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉగ్ర శిబిరాల‌పై మ‌న సైన్యం జ‌రిపిన మెరుపు దాడుల‌కు సంబంధించిన విజ‌యంపై మోదీ క్రెడిట్‌ తీసుకోవద్దా? అని కూడా రాజ్ నాథ్ ప్ర‌శ్నించారు. మొత్తంగా ఈ విష‌యంలో త‌న‌దైన శైలి లాజిక్ లాగిన రాజ్ నాథ్ విప‌క్షాల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశార‌నే చెప్పాలి.