Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. కానీ వీళ్లెందుకు సైలెంట్ అయ్యారు?

By:  Tupaki Desk   |   8 March 2022 7:28 AM GMT
ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. కానీ వీళ్లెందుకు సైలెంట్ అయ్యారు?
X
గ‌త కొన్ని నెల‌లుగా తెలుగు సినిమాని క‌రోనా క‌ష్టాలు వేధించాయి. ఆ త‌రువాత ప‌రిస్థితుల్లో మార్పులు మొద‌లైనా ఏపీ టికెట్ రేట్ల వివాదం టాలీవుడ్ ని ఇబ్బందుల‌కు గురిచేస్తూనే వుంది. దీని కార‌ణంగా చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాలు వ‌సూళ్ల ప‌రంగా న‌ష్టాల‌ని చ‌విచూడాల్సిన ప‌రిస్థితి. ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల‌ని పెంచుకునే వెసులుబాటుని క‌లిగించ‌క‌పోవ‌డం, అందుకు సంబంధించిన జీఓని విడుద‌ల చేయ‌కుండా జాప్యం చేస్తుండ‌టంతో భారీ చిత్రాలు చాలా వ‌ర‌కు న‌ష్టాల‌ని చ‌విచూశాయి. దీంతో కొంత మంది కోర్టుని కూడా ఆశ్ర‌యించడం జ‌రిగింది.

అయినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఎప్ప‌టికైనా ఏపీ ప్ర‌భుత్వం క‌రుణించ‌క‌పోతుందా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చాలా రోజులుగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఇండస్ట్రీ మొర‌ని ఆల‌కించింది. టికెట్ రేట్ల‌ని స‌వ‌రిస్తూ జీవోని విడుద‌ల చేసింది. వంద కోట్ల‌కు మించి బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్రాల టికెట్ లు పెంచుకునేందుకు వెసులుబాటుని క‌లిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తాజాగా కొత్త జీవోని విడుద‌ల చేసింది.

ఏప్రి ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచుకోవ‌డానికి వీళ్లేదంటూ విడుద‌ల చేసిన గ‌త జీవో పై ప్ర‌తీ ఒక్క‌రూ అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వంపై భారీ స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదురయ్యాయి. అయినా ఏపీ ప్ర‌భుత్వం ఆ విమ‌ర్శ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌ను చేయాల‌నుకుంది చేస్తూ వెళ్లిపోయింది. అయితే ఇటీవ‌ల టికెట్ రేట్ల‌కు సంబంధించిన జీవో విష‌యంతో పాటు ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్ , రాజ‌మౌళి, కొర‌టాల శివ వంటి వారు ప్ర‌త్యేకంగా సీఎం జ‌గ‌న్ తో భేటీ కావ‌డం తెలిసిందే.

ఈ భేటీ అనంత‌రం త్వ‌ర‌లోనే టికెట్ రేట్ల‌కు సంబంధించిన జీవోని విడుద‌ల చేస్తామంటూ ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్‌` సినిమా రిలీజ్ సంద‌ర్భంగా స‌వ‌రించిన జీవోని విడుద‌ల చేస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఏవో సాకులు చెప్పి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే ప‌వ‌న్ సినిమా రిలీజ్ త‌రువాతే జీవోని విడుద‌ల చేయాల‌ని ఏప్రి ప్ర‌భుత్వం ఎదురుచూస్తోంద‌ని చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ విమ‌ర్శ‌లని నిజం చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం తాజాగా టికెట్ రేట్ల‌ని స‌వ‌రిస్తూ జీవోని విడుద‌ల చేసింది.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి, హీరో ప్ర‌భాస్, ఆర్. నారాయ‌ణ‌మూర్తి సానుకూలంగా స్పందించారు. అయితే తాజా జీవోపై మ‌హేష్ కానీ, రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌..ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ స్టార్స్‌, స్టార్ డైరెక్ట‌ర్స్ స్పందించ‌క‌పోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా తాజా జీవో పై స్పందిస్తే.. ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు. కానీ మిగ‌తా వారు ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించ‌కుండా సైలెంట్ కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ తో జ‌రిగిన ప్ర‌త్యేక భేటీకి చిరు, ప్ర‌భాస్ తో క‌లిసి తాడేప‌ల్లి గూడెంలోని సీఎం క్యాంప్ కార్యాల‌యంలో హాజ‌రైన మ‌హేష్ స్పందించ‌క‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం గురించి ట్వీట్ చేసిన మ‌హేష్ టికెట్ రేట్ల‌ని స‌వ‌రిస్తూ ఏపీ విడుద‌ల చేసిన జీవో పై స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. చివ‌రికి చిన్న హీరోలు కూడా దీనిపై ఎలాంటి ట్వీట్ లు చేయ‌క‌పోవ‌డం విశేషం.

ఏపీ ప్ర‌భుత్వం క్రియేట్ చేసిన స‌మ‌స్య‌ని వారే క్లియ‌ర్ చేశారు కాబ‌ట్టి దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వాద‌నగా తెలుస్తోంది. ఈ కార‌ణంగానే స్టార్ హీరోలు ఎవ‌రూ దీనిపై స్పందించ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని ఇన్ సైడ్ టాక్‌. మ‌రి జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు విశ్లేష‌కులు.