Begin typing your search above and press return to search.

కొడుక్కి టికెట్ ఇచ్చేందుకు తండ్రి నో

By:  Tupaki Desk   |   8 March 2021 5:01 AM GMT
కొడుక్కి టికెట్ ఇచ్చేందుకు తండ్రి నో
X
పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉంది. దీనికి తగ్గట్లే.. ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ.. ఈసారి డీఎంకే అధికారంలోకి రావటం ఖాయమని.. సీఎంగా స్టాలిన్ పదవిని చేపడతారని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆచితూచి అన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంత కొడుక్కి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నోచెప్పి అందరిని సర్ ప్రైజ్ చేశారు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తమిళనాడులో టికెట్ల ఎంపిక కాస్త చిత్రంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారు.. పార్టీ ఆఫీసుకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. అనంతరం పార్టీ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాలి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు కమ్ నటుడు అయిన ఉదయనిధి ఎన్నికల బరిలో నిలిచేందుకు టికెట్ కోసం అప్లై చేశారు.

చెన్నైలోని థౌజెండ్ లైట్స్ లేదంటే చేపాక్ - ట్రిప్లికేన్ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి ఎన్నికల్లో నిలుచోవాలని భావించారు. అందుకు తగ్గట్లే టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవటం..ఇంటర్వ్యూకు హాజరయ్యారు. పార్టీ అధినేత హోదాలో స్టాలిన్.. డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ లు ఇంటర్వ్యూలు చేశారు. అయితే.. పార్టీ రాష్ట్ర యువనేతగా ఉన్న ఉదయనిధి.. ప్రచారానికి వెళ్లకుండా ఒక నియోజకవర్గానికి పరిమితం కావటం సరికాదంటూ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నో చెప్పేయటం ఆశ్చర్యకరంగా మారింది.

పార్టీ నిర్ణయానికి ఉదయనిధి తలవంచారు. కొడుక్కి టికెట్ ఇవ్వకుండా రిజెక్టు చేసిన వైనం తమిళనాడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఇంతకాలం బీజేపీ నేతలు సంధించే విమర్శలకు స్టాలిన్ తగురీతిలో సమాధానం ఇచ్చినట్లైంది. తమిళనాడులో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయంటూ బీజేపీ తరచూ విమర్శలు.. ఆరోపణలు చేస్తుంటుంది. అందుకు భిన్నంగా కుటుంబాలకు అతీతంగా టికెట్ల పంపిణీ డీఎంకేకు కలిసి వస్తుందన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తండ్రి పార్టీ అధినేత అయి ఉండి.. కొడుక్కి టికెట్ నో చెప్పే పరిస్థితే ఉండదు. అందుకు భిన్నంగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయం డీఎంకేకు లాభిస్తుందని చెప్పక తప్పదు.