Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:30 PM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు సాగుతున్నాయి. సీబీఐ దర్యాప్తులో రోజుకొక కొత్త విషయం వెలుగుచూస్తోంది. దర్యాప్తు 73వ రోజు చేరుకున్న వేళ వైఎస్ కుటుంబ సభ్యులను పిలిపించి విచారించడం ఆసక్తి రేపుతోంది.

ఇక కడప వెళ్లి మరీ బుధవారం వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత కలవడం సంచలనంగా మారింది.సీబీఐ అధికారులే ఆమెను పిలిపించారా? లేక తనకు తానుగా సునీత వెళ్లిందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పులివెందుల ఆర్అండ్ బీ అతిథిగృహంలో చేపట్టిన సీబీఐ విచారణకు వరుసగా రెండోరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడైన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేకా కూతురు హైకోర్టుకు సమర్పించిన అనుమానితుల జాబితాలో వీళ్లిద్దరి పేర్లు ఉండడం గమనార్హం.

గతంలో వైఎస్ వివేకానందారెడ్డి ఎమ్మెల్సీగా బరిలో దిగినప్పుడు ఆయన ఓడిపోయేందుకు మనోహర్ రెడ్డి తదితరులు కారణమనే ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిల నుంచి రాబట్టిన సమాచారంపై ఏదైనా క్లారిటీ కోసం వైఎస్ వివేకా కూతురు సునీతను సీబీఐ అధికారులు పిలిపించి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండోరోజు కూడా వాళ్లిద్దరినీ విచారిస్తున్న నేపథ్యంలో సునీత నుంచి మరింత సమాచారం రాబట్టారనే ప్రచారం జరుగుతోంది. గొడవలే హత్యకు కారణాలై ఉంటాయా? వారి మధ్య గొడవలేంటి? ఆర్థికపరమైనవా? రాజకీయ సంబంధమైనవా? అనే కోణంలో సీబీఐ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను విచారిస్తుండడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.