Begin typing your search above and press return to search.

ఓట‌మిని మించి.. టీడీపీలో ఏదో జ‌రుగుతోంది..!

By:  Tupaki Desk   |   15 Aug 2019 7:48 AM GMT
ఓట‌మిని మించి.. టీడీపీలో ఏదో జ‌రుగుతోంది..!
X
తాజాగా దేశంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. జాతీయ పార్టీలు- ప్రాంతీయ పార్టీలు కూడా జెండా పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటున్నారు. దీనికి అధికారంతో ప‌నిలేదు. దేశ‌భ‌క్తితోనే ప‌ని అన్న‌ట్టుగా ఆసేతు హిమ‌చాలం నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున ఈ పండ‌గ‌ను చేసుకుంటున్నారు. అయితే, ఏపీలో మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండ‌డం అనేక ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది.

నిజానికి గ‌త ఏడాది ఈ పండుగ‌ను టీడీపీ నేత‌లు భారీ ఎత్తున చేసుకున్నారు. ఇక‌, అప్ప‌టి వైసీపీ నాయ‌కు లు కూడా త‌మత‌మ కార్యాల‌యాల్లో జెండాలు ఎగ‌రేసుకుని పండగ చేసుకున్నారు. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. టీడీపీ విప‌క్షంలోకి వ‌చ్చింది. అంత మాత్రాన పార్టీకి ఫండ్స్ లేకుండా పోవుక‌దా? నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా పార్టీ అధికారంలోనే ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు నిధుల స‌మ‌స్య ఉత్ప‌న్న మ‌య్యే ప‌రిస్థితి లేదు. కానీ, దాదాపు ప్ర‌ధాన కార్యాల‌యాల్లో ఒకింత జెండా పండుగ జ‌రిగినా.. కీల‌క‌మైన విజ‌య‌వాడ వంటి చోట్ల పార్టీ కార్యాయాల్లో జెండా పండుగ‌కు త‌మ్ముళ్లు హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ అధినేత చంద్ర‌బాబు చెయ్యి నొప్పి కార‌ణంగా ఇప్ప‌టికే ఆయ‌న హైద‌రాబాద్‌ కు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధాన కార్యాల‌యాల్లో జోష్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పైగా నాయ‌కులు కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది? అనే ప్ర‌శ్న మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీలో ఎన్ని లుక‌లుక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టిని నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది క‌దా! అనేది విశ్లేష‌కుల మాట‌.

అయితే, ఎక్క‌డిక‌క్క‌డ త‌మ్ముళ్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెచ్చ‌రిల్ల‌డం, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌ని తీరు వంటివి ఇప్పుడు పార్టీకి శాపంగా మారుతున్నాయ‌ని, ఎవ‌రికి వారు మాకెందుకులే అనుకుంటున్నార‌ని... అందుకే ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని చెప్ప‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా మారింది.