Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌లో వ‌ణుకు పుట్టిస్తున్న ఆ భేటీ!

By:  Tupaki Desk   |   11 May 2017 4:38 AM GMT
త‌మ్ముళ్ల‌లో వ‌ణుకు పుట్టిస్తున్న ఆ భేటీ!
X
కార‌ణం లేకుండా ఉలిక్కిప‌డుతున్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ త‌మ్ముళ్లు. బుధ‌వారం ఉద‌యం ప్ర‌ధాని మోడీతో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ కావ‌టం.. అనంత‌రం భేటీ వివ‌రాల్ని వెల్ల‌డించిన జ‌గ‌న్ మాట‌లు ఏపీ అధికార‌ప‌క్షంలో హాట్ టాపిక్ గా మారాయి. ఓప‌క్క త‌మ పార్టీకి చెందిన మంత్రి నారాయ‌ణ కుమారుడి దుర్మ‌ర‌ణ వార్తతోనే షాక్ లో ఉన్న పార్టీకి.. ప్ర‌ధాని మోడీతో జ‌గ‌న్ భేటీ కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల విష‌యంలో ఏన్డీయే అభ్య‌ర్థికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ తేల్చేయ‌టం.. బీజేపీకి త‌మ పార్టీకి మ‌ధ్య సైద్ధాంతికంగా రెండు అంశాల్లోనే తేడా ఉంది త‌ప్పించి.. మిగిలిన అంశాల్లో ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌న్న మాట‌ల‌పైనే తెలుగు త‌మ్ముళ్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. తాజా భేటీ మోడీ.. జ‌గ‌న్ మ‌ధ్య అనుబంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని.. అదే జ‌రిగితే భ‌విష్య‌త్ ప‌రిణామాలు ఎలా ఉండ‌నున్నాయ‌న్న విష‌యం మీద‌నే తెలుగు త‌మ్ముళ్ల‌లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల వేళ‌.. మ‌రో 20 వేల ఎల‌క్ట్రోర‌ల్ కాలేజీ ఓట్లు (టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ మ‌ద్ద‌తు ఇస్తే) మాత్రం అవ‌స‌ర‌మైన వేళ‌.. జ‌గ‌న్ త‌న‌కు తానుగా రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చేసిన వైనం త‌మ్ముళ్ల‌కు మింగుడుప‌డ‌టం లేద‌న్న వాద‌న జోరుగా వినిపిస్తోంది. అసలు.. జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం ఏమిట‌న్న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం కావ‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క త‌మ అధినేత దేశంలో లేని వేళ‌.. చోటు చేసుకున్న ఈ ప‌రిణామం త‌మ్ముళ్ల‌లో కొత్త గుబులుకు కార‌ణంగా మారింద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు త‌మ్ముళ్లు త‌మ లోగుట్టు చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా మోడీ.. జ‌గ‌న్ తాజా భేటీ ఏపీ తెలుగు త‌మ్ముళ్ల‌లో హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.