Begin typing your search above and press return to search.

ఒకే వేళలో తెలంగాణ పార్టీలన్నింటిలో కీలక పరిణామాలు.. ఎందుకిలా?

By:  Tupaki Desk   |   9 July 2021 2:30 PM GMT
ఒకే వేళలో తెలంగాణ పార్టీలన్నింటిలో కీలక పరిణామాలు.. ఎందుకిలా?
X
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గడిచిన కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటం ఎక్కువైంది. అందరూ ఒకే మాట అనుకొని మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఒకే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవటం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడోకానీ చోటు చేసుకోదని చెప్పాలి.

నెలల తరబడి ఊరించి.. ఊరించి.. విసిగిపోయేలా చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయటం.. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మోడీ కాబినెట్ లో కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కటంతో పాటు.. తెలంగాణ బీజేపీలో ఆయన స్థానం ఏమిటన్న విషయాన్ని అధినాయకత్వం చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు.. ఒకవేళ బీజేపీ కానీ తెలంగాణలో అధికారంలోకి వస్తే.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపైనా ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇలా రెండు పార్టీల్లో చోటు చేసుకున్న పరిణామాలకు తగ్గట్లే.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు వైఎస్ షర్మిల. తెలంగాణ హక్కుల కోసం.. రాజన్న రాజ్య స్థాపన కోసం ఆమె గళం విప్పనున్నట్లు చెప్పారు. ఇలా ఒక పార్టీ తర్వాత మరో పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంటే.. టీడీపీకి ఉన్న పెద్ద నేతల్లో ఒకే ఒక్కడైన రమణ పార్టీ పదవికి రాజీనామా చేయటం.. త్వరలో ఆయన గులాబీ కారు ఎక్కేయటానికి రెఢీ అవుతున్నారు. దీంతో.. ఇప్పటికే ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి తాజా పరిణామంతో తల కూడా లేని పరిస్థితి నెలకొంది. ఇక.. అధికార గులాబీ పార్టీ విషయానికి వస్తే.. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్.. తన రాజకీయ వారసుడ్ని ఎప్పుడో ప్రకటించటమే కాదు.. ఆయన్ను అధికార గద్దె మీద కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు. కానీ.. ఫలించలేదు.

చేతిలో తిరుగులేని అధికారం ఉన్నప్పటికీ తన వారసుడికి రాజ దండాన్ని అందజేయాలన్నకేసీఆర్ కోరిక తీరలేదు. అదే సమయంలో.. టీడీపీ ఊసురు తీసే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. రమణను పార్టీలోకి తీసుకురావటం ద్వారా తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా ఆయన్ను దించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్ అయిన రమణకు కేసీఆర్ ఛరిష్మా తోడైతే.. ఈటలను నిలువరించటం తేలిక అవుతుందన్న వాదన వినిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏ రాష్ట్రంలో అయినా ఒక సందర్భంలో ఒకట్రెండు పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది సహజం. అందుకు భిన్నంగా ఒకే సమయంలో వరుస పెట్టి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం మాత్రం చాలా అరుదుగా చెప్పక తప్పదు. ఇదే అంశానికి సంబంధించి మరో కోణం ఏమంటే.. తాజాగా జరిగిన మార్పులన్ని కూడా భవిష్యత్తుల్లో కీలకభూమిక పోషించేవిగా ఉండటం మరో విశేషంగా చెప్పొచ్చు. ఏమైనా.. తాజా పరిణామాలు మాత్రం అనూహ్యం.. చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.