Begin typing your search above and press return to search.

విరాళాలు వ‌ద్దు స‌రే.. మించిన సాయం చేయొచ్చుగా మోడీ?

By:  Tupaki Desk   |   23 Aug 2018 7:04 AM GMT
విరాళాలు వ‌ద్దు స‌రే.. మించిన సాయం చేయొచ్చుగా మోడీ?
X
సిద్ధాంతాలు ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ..అవేవీ కూటికి.. గుడ్డ‌కు.. క‌డుపు నిండా ఆక‌లిని తీర్చ‌న‌విగా ఉంటే ప్ర‌యోజ‌నం ఏమైనా ఉంటుందా? క‌డుపు కాలుతుంటే.. తిన‌టానికి తిండి ఉండ‌దు కానీ..గొప్ప‌ల‌కు మాత్రం త‌క్కువ లేద‌న్న‌ట్లుగా ఉంది మోడీ స‌ర్కారు తీరు చూస్తుంటే.

దేశంలో ఏదైనా రాష్ట్రం ప్ర‌కృతి ప్ర‌కోపంతో భారీ న‌ష్టం వాటిల్లితే మాన‌వ‌తా సాయంగా ఏదైనా దేశం ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టిస్తే.. థ్యాంక్స్ చెప్పి.. ఫ‌ర్లేదండి.. మీ డ‌బ్బులు అక్క‌ర్లేదు.. కాకుంటే పెద్ద మ‌న‌సుతో స్పందించారు చూశారా? అదే ప‌దివేలు అన్న మాట‌లేం త‌ప్పు కాదు. అయితే.. ఎప్పుడీ మాట‌ల‌న్ని.. త‌మ‌కు ఎవ‌రి ఆర్థిక సాయం అవ‌స‌రం లేకుండా.. త‌మ‌కొచ్చిన క‌ష్టాన్ని త‌మ ద‌గ్గ‌రున్న వ‌న‌రుల‌తో మేనేజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ప్పుడు.

దేశీయంగా ఇత‌ర దేశాల ముందు ప‌లుచ‌న కాకుండా ఉండేందుకు అప్పుడెప్పుడో ఒక ధ‌ర్మం పెట్టుకున్న భార‌త్.. ఆ మాట‌ను చూపించి కేర‌ళ‌కు యూఏఈ ఇస్తామన్న రూ.700 కోట్ల‌కు మోడీ స‌ర్కారు మోకాల‌డ్డ‌టం చూసిన‌ప్పుడు ఒళ్లు మండిపోక మాన‌దు. వందేళ్ల చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత భారీ ప్ర‌కృతి విప‌త్తు చోటు చేసుకున్న‌ప్పుడు.. సాయం చేయ‌టానికి ముందుకు వ‌చ్చిన వారిని అడ్డుకుంటున్న‌కేంద్రం తీరుపై కేర‌ళ ప్ర‌భుత్వంతో పాటు.. కేర‌ళ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

కేర‌ళ‌కు యూఏఈ ప్ర‌క‌టించిన రూ.700 కోట్ల సాయం అక్క‌ర్లేదంటూ భార‌త్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. విదేశీ సాయాన్ని తీసుకోకూడ‌ద‌ని ఏ చ‌ట్టంలో ఉందంటూ కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీల‌కు అతీతంగా కేర‌ళ‌లోని రాజ‌కీయ పార్టీల‌న్నీ కేంద్రం తీరును త‌ప్పు ప‌డుతున్నాయి.

ఇదిలా ఉంటే.. 2004 డిసెంబ‌రులో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ స‌ర్కారు.. విదేశీ సాయాన్ని వ‌ద్ద‌నే నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. సునామీ కార‌ణంగా దేశంలోని ప‌లు రాష్ట్రాలు తీవ్ర న‌ష్టాల‌కు గురైన సంద‌ర్భంలో విదేశీ సాయం చేస్తామ‌న్న అంశంపై నాటి ప్ర‌భుత్వం వ‌ద్దంటూ నిర్ణ‌యాన్ని తీసుకుంది.

త‌మ‌కు ఎదురైన క‌ష్టాన్ని అధిగ‌మించేందుకు భార‌త్ త‌న‌కు తానుగా ప్ర‌య‌త్నిస్తుంద‌ని.. త‌న‌కున్న అవ‌కాశాల్ని వినియోగించుకుంటుంద‌న్న మాట‌ను చెప్పింది. నాడు సునామీ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం.. నేడు కేర‌ళ‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ఒక్క‌టిగా పోల్చ‌లేని ప‌రిస్థితి.

మ‌రోవైపు.. కేర‌ళ‌కు జ‌రిగిన న‌ష్టాన్ని విదేశీ సాయం వ‌ద్ద‌నే కేంద్రం.. త‌న‌కు తానుగా భారీగా నిధులు అందించినా కొంత‌లోకొంత ఫ‌ర్లేద‌నుకోవ‌చ్చు. కానీ.. కేంద్రం నుంచి సాయం స‌రిగా అంద‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు విదేశాల నుంచి వ‌చ్చేభారీ సాయాన్ని వ‌ద్ద‌న‌టంలో అర్థం లేద‌న్న మాట వినిపిస్తోంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ‌కు ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు ఆస్తులు మొత్తం క‌లిపితే జ‌రిగిన న‌ష్టం దాదాపుగా రూ.2ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్న అంచ‌నాలు వినిపిస్తున్న వేళ‌.. కేర‌ళ త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డే చేయూతను కేంద్రం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. లేనిప‌క్షంలో మోడీ స‌ర్కారు తీరును మ‌ల‌యాళీలు మ‌రెప్ప‌టికీ మ‌ర్చిపోర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.