Begin typing your search above and press return to search.

పసుపుబోర్డు ఎందుకు రాజకీయ అంశమైంది? దాంతో లాభాలేంటి?

By:  Tupaki Desk   |   5 March 2021 8:30 AM GMT
పసుపుబోర్డు ఎందుకు రాజకీయ అంశమైంది? దాంతో లాభాలేంటి?
X
సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి.. అక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం ‘పసుపు బోర్డు’ అంశమే. ఇప్పుడు గెలిచి రెండేళ్లు అయినా నెరవేర్చని అరవింద్ ను వెంటాడుతున్నారు రైతులు. ఆయనకు నిరసన సెగ తగులుతోంది.

దేశమంతా పసుపు ధర పెరగడంపై చర్చ జరుగుతుంటే.. నిజామాబాద్ లో మాత్రం ఎన్నికల హామీ అయిన పసుపు బోర్డు కోసం రైతులు పోరాడుతున్నారు.

పాత నిజామాబాద్.. పాత కరీంనగర్ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో పసుపు పంట బాగా పండుతుంది. ఇక్కడ పసుపు బోర్డు ఉంటే తమకు మేలు జరుగుతుందని రైతులు కొన్నేళ్లుగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు.

పసుపు బోర్డు ఉంటే పంట అభివృద్ధి, విస్తరణ, నాణ్యత ప్రమాణాలు పాటించడం వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతాయి. రైతులకు సలహాలు ఇవ్వడం.. రైతులకు లాభం చేకూరేలా పసుపు ఎగుమతులకు అనువైన పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. పసుపుయే కాదు.. అన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు కలిపి 1987లో సుగంధ ద్రవ్యాల బోర్డు కేరళలోని కోచిలో ఏర్పాటు చేశారు. రైతుల ప్రయోజనాలు, పరిశోధన, గిట్టుబాటు ధర వంటి చర్యలను ఈ బోర్డు తీసుకుంటుంది. మొత్తం 52 సుగంధ ద్రవ్యాల కోసం ఇది పనిచేస్తుంది అందులో పసుపు కూడా ఒకటి.

అయితే దేశంలో పండే పసుపులో సుమారు 70శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ఇక్కడ ప్రత్యేక బోర్డు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టీబోర్డు, పొగాకు బోర్డులాగా పసుపు బోర్డు ఉంటే రైతులకు లాభం అని.. అందుకే కోరుతున్నామని రైతులు చెబుతున్నారు.

2017 ఆగస్టులో అప్పటి ఎంపీ కవిత పసుపుబోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోడీని కలిశారు. 2018లో సురేష్ ప్రభు స్పైసెస్ డెవలప్ మెంట్ పార్క్ ప్రకటించారు. 2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178మంది రైతులు నామినేషన్లు వేశారు.

అయితే నాడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ ‘బీజేపీ ఎంపీ తాను గెలిచిన తరువాత పసుపుబోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’ అని రాతపూర్వకంగా రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆయన తీసుకురాకపోవడంపై రైతులు ఆందోళన చేస్తున్నారు.