Begin typing your search above and press return to search.

జగన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

By:  Tupaki Desk   |   19 March 2021 3:14 AM GMT
జగన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
X
ఎంతసేపు జగన్మోహన్ రెడ్డినే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నది కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ అయితే పవన్ మాత్రం చాలా విచిత్రంగా జగన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా ఓ వీడియో సందేశం ఇచ్చిన పవన్ అందులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేయటంలో తప్పులేదు. కానీ ఈ అంశం కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటే సాధ్యం కాదు. సాధ్యంకాదని తెలిసే పవన్ ఇలాంటి డిమాండ్లు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఇంకా విచిత్రమేమంటే ఢిల్లీ వెళ్ళి మాట్లాడాలంటే తమకు ఎంపిల బలం లేదని చెప్పటం. అంటే జనసేన తరపున ఎంపిలు లేరనే సాకును చూపించి కేంద్రాన్ని డిమాండ్ చేయటం నుండి తప్పుకోవటమే. జనసేన తరపున ఎంపిలు లేరన్న విషయం అందరికీ బాగా తెలుసు. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జనసేన మిత్రపక్షమని కూడా తెలుసు. కేంద్రాన్ని డిమాండ్ చేయటంలో పవన్ కు చిత్తశుద్దుంటే విశాఖలో జరుగుతున్న ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.

మిత్రపక్షంగా కేంద్రంపై ఒత్తిడి చేయటానికి అనేక మార్గాలుంటే అన్నింటినీ వదిలేసి కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేయటంలోనే పవన్ డొల్లతనం బయటపడుతోంది. పవన్ డిమాండ్ చేసినట్లుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేస్తే ఏమవుతుంది ? ఆ తీర్మానాన్ని పంపాల్సింది మళ్ళీ ఢిల్లీకే కదా. తీర్మానాన్ని ఢిల్లీకి పంపిన తర్వాత అక్కడేమవుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టి జగన్ను టార్గెట్ చేయటం మానేసి మిత్రపక్షంగా తాను ఏమి చేయగలరో దాన్ని ఆచరణలో చూపిస్తే బాగుంటుంది.