Begin typing your search above and press return to search.

ఆర్టీసీ నష్టాలు.. ఆ బస్సులపై విషప్రచారం ఎందుకు?

By:  Tupaki Desk   |   15 Oct 2019 8:26 AM GMT
ఆర్టీసీ నష్టాలు.. ఆ బస్సులపై విషప్రచారం ఎందుకు?
X
తెలంగాణ ఆర్టీసీలోని మొత్తం బస్సుల సంఖ్య 10,640. అందులో రెంట్ కు నడుస్తున్న బస్సులు 2,140. ఇవి ప్రైవేట్ వ్యక్తులవి. ఈ 2140 బస్సులలో ఒలెక్ట్రా బస్సుల సంఖ్య కేవలం నలభై! శాతం వారీగా చూస్తే తెలంగాణ ఆర్టీసీ కోసం నడుస్తున్న బస్సుల్లో ఒలెక్ట్రా బస్సుల శాతం కేవలం 0.38 మాత్రమే! కనీసం అర శాతం కూడా లేదు వాటి సంఖ్య. కేవలం నలభై బస్సులు.

పదివేల కు పైగా ఉన్న బస్సుల్లో కేవలం నలభై బస్సులు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ బస్ ల వల్లనే తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తోందంటూ ఒక విష ప్రచారం సాగుతుండటమే విడ్డూరం. కేవలం ఆ కంపెనీని నిందించాలని ఇలాంటి వాదనలు వినిపిస్తున్నారు తప్ప అంతకు మించి ఆ ప్రచారంలో ఉన్న వాస్తవం ఏ పాటిదో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు.

అది కూడా ఆ నలభై బస్సులూ తెలంగాణ ఆర్టీసీలో చేరి కేవలం ఏడు నెలలే అయ్యాయి. ఆ ఏడు నెలల్లో వందల కోట్ల రూపాయల లాభం సంపాదించడమూ సాధ్యం కాదు,వందల కోట్ల నష్టం చేయడమూ సాధ్యం అయ్యేది కాదు. పది వేల బస్సులు ఉన్న సంస్థకు నలభై బస్సులు అద్దెకిచ్చిన ఓనర్ ను మొత్తం నష్టాలు నిందించడం ఎంత వరకూ సబబు?

ఆర్టీసీకి నష్టాలు కొత్తవి కావు. దశాబ్దాల నుంచి ఆర్టీసీ నష్టాల్లోనే నడుస్తోంది. ఉమ్మడి ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది, ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మరి అలాంటి నష్టాల విషయంలో ఏడు నెలల కిందట మొదలైన నలబై బస్సులను నిందించడం విడ్డూరం. ఆర్టీసీ పది యేలా పన్నెండు వందల కోట్ల రూపాయలను నష్టపోతోంది. దానికి ప్రధాన కారణం.. ఇంధనం ధరలు పెరగడం, ఇంధన సబ్సిడీ కింద ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం తదితర కారణాలున్నాయి.

అవేవీ పట్టించుకోకుండా.. ఆ నలభై బస్సులే మొత్తం ఆర్టీసీ నష్టాలన్నింటికీ కారణం అవుతున్నాయనట్టుగా మాట్లాడటం ఎంత ప్రహసనమో అర్థం చేసుకోవచ్చు. అలాగే మరో విషయంలో ఒలెక్ట్రా బస్సులను తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిందని అనడం. అవి కేవలం లీజు పద్దతిన అప్పగించినవి మాత్రమే. వాటిని టీఎస్ ఆర్టీసీ కొనలేదు. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. మరి అలాంటప్పుడు ఒలెక్ట్రా సంస్థ మూడు వేల కోట్ల రూపాయలను ఎలా పొందుతుంది? అది కూడా కేవలం నలభై బస్సులతో! అది కూడా ఏడు నెలల వ్యవధిలో. ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒలెక్ట్రాని టార్గెట్ చేస్తోంది? వాటికి ఆ అవసరం ఎందుకు వచ్చింది? అనేవి శేష ప్రశ్నలు.