Begin typing your search above and press return to search.

ఆ తప్పే ఉత్తమ్ కొంపముంచిందా?

By:  Tupaki Desk   |   24 Oct 2019 6:26 AM GMT
ఆ తప్పే ఉత్తమ్ కొంపముంచిందా?
X
బలం లేని చోట్ల గెలవటంలో ఉన్న మాజా అంతా ఇంతా కాదు. అదే సమయంలో తమకు అడ్డాలాంటి ప్లేస్ లో ఓటమికి మించిన బాధ మరొకటి ఉండదు. మొదటిది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజాయ్ చేస్తుంటే.. రెండోది మాత్రం ఉత్తమ్ ఫ్యామిలీకి ఎదురైందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. ఉత్తమ్ కు తిరుగులేని రక్షగా ఉండే హుజూర్ నగర్ లో ఎట్టకేలకు టీఆర్ఎస్ వశమైంది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఉప ఎన్నిక ఒకదశలో గులాబీ నేతలు ప్రచారం చేయటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేని పరిస్థితి. అలాంటిచోట ఇంత భారీ మెజార్టీ ఎలా సాధ్యమవుతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ రథసారధిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్.. తన సొంత స్థానాన్ని సైతం కాపాడుకోలేకపోవటాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు.

తాజా విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై యావత్ తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమైనట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ అదే పరిస్థితి. వీటికి భిన్నంగా తాజా ఎన్నికల ఫలితం వెలువడటం చూస్తే.. ఇదెలా సాధ్యమైంది? అన్న విషయంలోకి వెళితే.. ఉత్తమ్ అండ్ కో తప్పులే కేసీఆర్ కు విజయానందాన్ని కలిగేలా చేశాయన్న మాట వినిపిస్తోంది.

రౌండ్ రౌండ్ కి పెరుగుతున్న అధిక్యతను చూస్తే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ అధిక్యతను సాధించటం పక్కా అన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు ఐదారు రోజుల వరకూ పట్టుబిగించిన ఉత్తమ్ అండ్.. చివరి రెండు రోజుల్లో చేసిన తప్పులే.. ఓటమి తిప్పలుకు కారణంగా చెబుతున్నారు. పోలింగ్ ప్రారంభం కావటానికి ముందు వరకూ టీఆర్ఎస్ శ్రేణులు పూర్తిస్థాయిలో కష్టపడితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం అనైక్యతతో వ్యవహరించారని.. అదే వారి కొంప ముంచే ఫలితాన్ని వెల్లడికి కారణమైందంటున్నారు. ఏమైనా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు కచ్ఛితంగా ఉత్తమ్ తప్పులే ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.