Begin typing your search above and press return to search.

టీమిండియా మెంటర్ గా ధోని అపాయింట్ వెనుక పెద్ద కథ?

By:  Tupaki Desk   |   30 Sep 2021 7:40 AM GMT
టీమిండియా మెంటర్ గా ధోని అపాయింట్ వెనుక పెద్ద కథ?
X
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ లో ఈ సంవత్సరమే ముగింపు. ప్రపంచ టీ20 కప్ గెలిస్తే గౌరవంగా కెప్టెన్ గా రిటైర్ అవుతారు. గెలవకుంటే తన కెప్టెన్ కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ గెలవని కెప్టెన్ గా అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదిలేస్తున్న విరాట్ కోహ్లీ నిర్ణయంతో ఇప్పుడు అతడి భవిష్యత్ పై సందేహాలు నెలకొంటున్నాయి.

ఇక 2019 వరల్డ్ కప్ లో చోటుచేసుకున్న పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదని బీసీసీఐ భావిస్తోంది. క్రికెట్ ప్రపంచంపై సాగిస్తోందన్న ఆధిపత్యం చేజారకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో మళ్లీ ఒక్కసారిగా ఈ విభేదాలు తెరమీదకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ లో ఇంగ్లండ్ లో జరిగిన డబ్ల్యూ.టీసీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలపై సీనియర్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా దృష్టికి తీసుకెళ్లారని.. మ్యాచ్లో ఓడిపోవడానికి గల కారణాలను వారు వివరించారని అంటున్నారు. రవిచంద్రన్ అశ్విన్, పూజారా, రహానే బీసీసీఐ కార్యదర్శిని కలిశారని తెలుస్తోంది. దీన్ని బీసీసీఐ తోసిపుచ్చినా.. కారణాలు మాత్రం బయటకు రాలేదు.

టీమిండియాలో సీనియర్లతో కోహ్లీ విభేదాల నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విభేదాలు, మనస్పర్థల ప్రభావం జట్టు విజయాలపై పడకుండా ఉండడానికే బీసీసీఐ పెద్దలు, టీమీండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని పిలిపించారని అంటున్నారు. మెంటార్ గా నియమించడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు.

జుట్టు లోని సీనియర్ ప్లేయర్లు, విరాట్ కోహ్లీకి మధ్య సమన్వయం సాధించేలా ధోని పాత్ర ఉంటుందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్న మెంట్ కు ఎంపికైన ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్ కు కూడా ధోని అంటే ఓ గౌరవ భావం ఉంది. అతన్ని పెద్దన్నలా భావిస్తారు. అందుకే ఈ కోల్డ్ వార్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని రూపుమాపడానికి ధోని సహకరిస్తాడని.. జట్టులో స్ఫూర్తి నింపడానికి దోహదపడుతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.