Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌హిళా మంత్రి త‌న పేరు మార్చుకుంది.. అందుకేనా?

By:  Tupaki Desk   |   14 July 2022 8:34 AM GMT
ఏపీలో మ‌హిళా మంత్రి త‌న పేరు మార్చుకుంది.. అందుకేనా?
X
అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు.. ఉష‌శ్రీ చ‌ర‌ణ్. ఉన్న‌త విద్యావంతురాలైన ఆమె కుర‌బ (బీసీ) సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. ఈ సామాజిక స‌మీక‌ర‌ణాలే క‌లిసొచ్చి.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెండోసారి చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఉష‌శ్రీ చ‌ర‌ణ్ జ‌గ‌న్ కేబినెట్ లో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మ‌రోవైపు అనంత‌పురంలోని శ్రీకృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీలో ఆమె పీహెచ్డీ కూడా చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆమె త‌న పేరును మార్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆమెను ఉష‌శ్రీ చ‌ర‌ణ్ అని పిలుస్తుండ‌గా ఉషాశ్రీ చ‌ర‌ణ్ గా మార్చుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత ఆమె త‌న పేర్చు మార్చుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా కొంత‌మంది జ్యోతిష్కుల సూచ‌న మేర‌కే ఆమె పేరు మార్చుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక‌పై అధికారిక పత్రాల్లో, కార్యకలాపాల్లో, శిలాఫలకాల్లో ఉష‌శ్రీ చ‌ర‌ణ్ కొత్త పేరు క‌నిపించ‌నుంది.

ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ), ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమె కోరిక మేర‌కు ఆమె పేరు మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వాస్త‌వానికి మంత్రి అయిన తర్వాత తన పేరును ఉషశ్రీ చరణ్ నుంచి ఉషా శ్రీ చరణ్ గా మార్చాలంటూ ఆమె పెట్టుకున్న వినతిని సాధారణ పరిపాలన శాఖ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఇందుకు నాలుగైదు రోజులు పట్ట‌ద‌ని చెబుతున్నారు. అయితే వివిధ కార‌ణాలతో సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఆమె పేరు ఆమోదానికి 40 రోజులు స‌మ‌యం తీసుకుంద‌ని అంటున్నారు.

కాగా ఇటీవల వైఎస్సార్సీసీ ప్లీన‌రీలో పార్టీ పేరును మార్చిన సంగ‌తి తెలిసిందే. యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఇక నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లేదా వైఎస్సార్సీపీ అని మాత్ర‌మే పిల‌వాల్సి ఉంటుంది. ఈ మేర‌కు పార్టీ బైలాస్ లో మార్పులు చేశారు. పొడి అక్ష‌రాల్లోనే వైఎస్సార్సీపీ అని పిల‌వాల‌ని ఆ పార్టీ కోరింది.

అలాగే గ‌తంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ త‌న పేరును మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణారావుగా మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా మంత్రి చెల్లుబోయిన వేణు కూడా త‌న పూర్తి పేరును రాయాల‌ని మీడియా సంస్థ‌ల‌ను కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. చెల్లుబోయిన వేణు పూర్తి పేరు.. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ కావ‌డం గ‌మ‌నార్హం.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ త‌న పేరును ఉషాశ్రీ చ‌ర‌ణ్ గా మార్చుకోవ‌డం విశేషం.