Begin typing your search above and press return to search.

క‌రోనా క‌న్నా..అక్క‌డ దారుణాలు, ప్ర‌పంచం గుర్తించ‌దే

By:  Tupaki Desk   |   17 March 2020 10:30 PM GMT
క‌రోనా క‌న్నా..అక్క‌డ దారుణాలు, ప్ర‌పంచం గుర్తించ‌దే
X
నెల రోజుల వ్య‌వ‌ధి నుంచి ప్ర‌పంచం అంతా క‌రోనా గురించి తెగ స్పందిస్తూ ఉంది. చైనా నుంచి పుట్టిన ఈ వైర‌స్ మీద యుద్ధానికి ప్ర‌పంచ‌మే క‌దిలింది. ప్ర‌భుత్వాలు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెడుతున్నాయి. అనేక సంస్థ‌లు క‌ద‌లివ‌స్తున్నాయి. ప్ర‌పంచం చేయీచేయీ క‌లిపి క‌రోనాను ఎదుర్కొన‌డానికి రెడీ అవుతోంది. చికిత్స ప‌ద్ధ‌తుల గురించి పరిశోధ‌న‌లు సాగుతున్నాయి. సాటి మ‌నుషులను ర‌క్షించ‌డానికి అన్న‌ట్టుగా ప్రపంచం మొత్తం క‌దులుతున్న తీరు అభినంద‌నీయ‌మే.

అయితే ఇదే ప్ర‌పంచం క‌రోనా క‌న్నా తీవ్ర‌మైన దారుణాలు జ‌రుగుతున్నా కొన్ని అంశాల‌ను గుర్తించ‌డం లేదు. తాజా యూనిసెఫ్ విడుద‌ల చేసిన ఒక నివేదిక షాకింగ్ లా ఉంది. అది సిరియాలో సాగుతున్న యుద్ధం గురించి. గ‌త కొన్నేళ్లుగా సిరియా అంత‌ర్యుద్ధం తో, అమెరికా సాగిస్తున్న దాడుల‌ తో మండుతూ ఉంది. ఈ మంట‌ల్లో కొన్ని వేల మంది మ‌ర‌ణించారు. మ‌ర‌ణించిన వారిలో టెర్ర‌రిస్టు లో మ‌రెవ‌రో ఉంటే పెద్ద వార్త కాదు.

అయితే ఐదు వేల మంది చిన్నారులు అక్క‌డ మ‌ర‌ణించార‌ని యూనిసెఫ్ వివ‌రిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మ‌ధ్య‌న సిరియాలో యుద్ధం వ‌ల్ల మ‌ర‌ణించి చిన్నారుల సంఖ్య 5,400 అని యూనిసెఫ్ వివ‌రించింది. అంత మంచి ప‌సిపిల్ల‌లు-చిన్నారులు యుద్ధోన్మోదానికి బ‌లి అయ్యారంటే.. అది ఎంత విషాద‌క‌ర‌మో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌తి ప‌ది నిమిషాల వ్య‌వ‌ధిలోనూ ఒక చిన్నారి సిరియాలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడ‌ని, యుద్ధ హింసాకాండ ఇలా వారి ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటూ ఉంద‌ని యూనిసెఫ్ వివ‌రించింది.

క‌రోనా గురించి ప్ర‌పంచం ఆందోళ‌న చెందుతూ ఉంది. అయితే ఇలాంటి విష‌యాల‌ను మాత్రం విస్మ‌రిస్తూ ఉంది. అభంశుభం ఎర‌గని చిన్నారులు అలా చ‌నిపోతున్నార‌ని తెలిసినా.. యుద్దోన్మాదం త‌గ్గ‌క‌పోవ‌డం విచార‌క‌రం.