Begin typing your search above and press return to search.

వాలంటీర్లను వైసీపీ నేతలే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

By:  Tupaki Desk   |   6 July 2022 5:28 AM GMT
వాలంటీర్లను వైసీపీ నేతలే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
X
అధికార వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఒక అంశం పదే పదే హైలైట్ అవుతోంది. ఆ అంశం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్ధ. కర్నూలు, నెల్లూరు, సత్తెనపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు మాట్లాడుతూ వాలంటీర్లు బాగా పనిచేయకపోతే తీసేయమని చెబుతున్నారు. వాలంటీర్లను నియమించింది ఎంఎల్ఏలు, స్ధానిక నేతలే కదా అని నిలదీస్తున్నారు. మనం పెట్టిన వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదంటే వేరే వాళ్ళని పెట్టవచ్చంటు సూచిస్తున్నారు.

సరే ఎవరు బాగా చేస్తున్నారు ? ఎవరిని తీసేసి ఇంకెవరిని పెడతారనే విషయాలు అప్రస్తుతం. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాలంటీర్ల వ్యవస్ధకు జనాల్లో మంచి పేరొచ్చింది. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత వాలంటీర్ల ద్వారా చాలా పనులు జనాలకు స్పీడుగా అయిపోతున్నాయన్నది వాస్తవం. ఎక్కడైనా లోటుపాట్లుంటే ఉండవచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ వ్యవస్ధ బాగా పనిచేస్తోందనే చెప్పాలి.

ఇక్కడ సమస్య ఏమిటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ పనితీరు వల్ల ఎంఎల్ఏలు, నేతల దగ్గరకు పనుల కోసం వెళ్ళే జనాల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నది వాస్తవం. గతంలో ఏ చిన్న పనున్నా జనాలు వెళ్ళేది చోటా మోటా నేతలు లేదా ఎంఎల్ఏల దగ్గరకే.

కొత్తగా ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్ధ వల్ల జనాలందరూ గ్రామ, వార్డు సచివాలయాలకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పనులు చాలా వరకు అక్కడే అయిపోతున్నాయి. వాలంటీర్లు జనాల ఇళ్ళకే వెళ్ళి ఫాలోఅప్ సమాచారాన్ని అందిస్తున్నారు. ఇదే సమయంలో వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా జనాలకు అప్ డేట్ సమాచారం అందుతోంది.

సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ గట్టిగా పనిచేస్తున్న కారణంగా ఎంఎల్ఏలు, కింద స్ధాయి నేతల దగ్గరకు పనుల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో తమకు జనాలపై పట్టు తగ్గిపోతోందనే ఆందోళన మొదలైంది.

ఈ నేపధ్యంలోనే వాలంటీర్లపై ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యవస్ధలను ఇంకా బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. దాంతో అటు జగన్ కు ఏమీ చెప్పలేక ఇటు కింది స్థాయి నేతలకు సర్ది చెప్పలేక మధ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు.