Begin typing your search above and press return to search.

ఏంటి జ‌గ‌న్ స‌ర్‌.. ఈ చూసి చ‌దువుడు..? అయినా.. త‌ప్పులే!

By:  Tupaki Desk   |   21 Nov 2022 12:30 PM GMT
ఏంటి జ‌గ‌న్ స‌ర్‌.. ఈ చూసి చ‌దువుడు..? అయినా.. త‌ప్పులే!
X
ప్ర‌జ‌ల‌కు ఎంతో చేశాన‌ని చెప్పుకొనే సీఎం జ‌గ‌న్‌.. ప‌ట్టుమ‌ని ప‌ది కార్య‌క్ర‌మాలు లేదా, ప‌ది సంక్షేమ ప‌థ‌కాల‌ను చెప్ప‌లేక పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న తాజాగా న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించి భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. అయితే, ఆయ‌న మాట్లాడిన తీరు చూస్తే టీవీల ముందున్న వారు ఛాన‌ళ్లు మార్చేయాల‌నే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు. ఎందుకంటే ప్ర‌తి వాక్యాన్ని, ప్ర‌తి లైన్‌ను చూడ‌కుండా ఆయ‌న చ‌ద‌వ లేక‌పోవ‌డ‌మే.

నిజానికి జ‌గ‌న్‌కు తెలుగురాదు అనుకునే ప‌రిస్థితి లేదు. గ‌త పాద‌యాత్ర‌ల స‌మ‌యంలో ఆయ‌న తెలుగును అన‌ర్గ‌ళంగా మాట్టాడారు. అంతేకాదు.. ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టును కూడా ఆయ‌న చ‌ద‌వ‌లేదు.

కానీ, అదేంటో కానీ, జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత మాత్రం ఆయ‌న ఏం మాట్లాడాల‌న్నా చూసి చ‌ద‌వాల్సిందే. చూసి చెప్పాల్సిందే. క‌నీసం ఆయ‌న ప్రారంభించిన ప‌థ‌కాలు, చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా సొంత‌గా చెప్ప‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్నాయి.

గ‌తంలో కాంగ్రెస్ పాల‌న స‌మ‌యంలో కేంద్రం నుంచి వ‌చ్చిన నాయకుల‌కు ఏపీలో ఏం జ‌రుగుతోందో ఏయే కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారో ..పేప‌ర్‌పై రాసి ఇచ్చేవారు. వారు దానిని చూసి చెప్పేవారు. ఈ క్ర‌మంలో ఒక్క అక్ష‌రం కూడా త‌ప్పు ప‌లికేవారు. ఇటీవ‌ల మోడీ ఏపీకి వ‌చ్చారు. విశాఖ‌ప‌ట్నం అభివృద్ధి చెందుతుందంటూ.. ఇక్క‌డ తాను ఏయే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారో చెప్పారు. వేటికి శంకుస్థాప‌న‌లు చేశారో కూడా అన‌ర్గ‌ళంగా త‌న‌కు తెలిసిన భాష‌లోనే వివ‌రించారు.

కానీ, ఏంటో.. సీఎం జ‌గ‌న్ మాత్రం త‌న వాడుక భాష‌, మాతృభాష‌లో కూడా స‌రిగా ప‌ల‌క‌లేక పోతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నారు. మ‌త్స్య‌కారులు అనాల్సిన జ‌గ‌న్ 'మ‌త కారులు-మ‌త్స‌కారులు' అంటూ.. త‌న నాలిక‌ను తానే స్లిప్ చేసుకున్నారు.

దీంతో అంతో ఇంతో ఇంట్ర‌స్టు ఉన్న‌వారు కూడా న‌రాలు బిగించుకుని ఆయ‌న ప్ర‌సంగాలు వినాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. తాజాగా కూడా ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టునే జ‌గ‌న్ చ‌ద‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మూడున్నరేళ్ల‌యినా.. ఎందుకీ త‌డ‌బాటో.. ఎందుకీ చూచి చ‌దువుడో ఆయ‌నకే తెలియాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.