Begin typing your search above and press return to search.

కూచిబొట్ల‌ శ్రీ‌నివాస్ భార్య‌కు పెద్ద భ‌రోసా ద‌క్కింది

By:  Tupaki Desk   |   10 Sep 2017 5:33 AM GMT
కూచిబొట్ల‌ శ్రీ‌నివాస్ భార్య‌కు పెద్ద భ‌రోసా ద‌క్కింది
X
అమెరికాలో మారిన ప‌రిస్థితుల వ‌ల్ల జాత్యాహంకారుల చేతిలో హ‌త్య‌కు గురైన తెలుగు ఎన్నారై శ్రీ‌నివాస్ కూచిబొట్ల ఉదంతం అంద‌రినీ కల‌చివేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగిన ఘ‌ట‌న‌లో పురింట‌న్ అనే వ్య‌క్తి ఆస్టిన్ బార్‌ లో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌లో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో అలోక్ మ‌ద‌సానిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. జాతి వివ‌క్ష‌తోనే పురింట‌న్ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పిస్తోల్‌ తో కాల్పులు జ‌రిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింట‌న్ అరుపులు పెట్టిన‌ట్లు సాక్షులు తెలిపారు. నిందితుడు పురింట‌న్‌ ను అడ్డుకున్న అమెరికా శ్వేత‌జాతీయుడు ఇయాన్ గ్రిల్ల‌ట్ ఇదే ఘ‌ట‌న‌లో హీరోగా ఆవిర్భ‌వించాడు.

అయితే హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలకు అమెరికాలో వీసా సమస్య ఎదురైంది. భర్త మృతితో సునయన రెసిడెంట్ ప్రతిపత్తిని కోల్పోయారు. భర్త అంత్యక్రియల కోసం భారత్‌ కు వచ్చిన ఆమె తిరిగి అమెరికాకు వెళ్ల‌లేకపోతున్నారు. ఆమెను అధికారులు వెనుకకు తిప్పి పంపే అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం. ఆమెకు వీసా ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని కాన్సస్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ తెలిపారు. ఈ వీసా స‌మ‌స్య పరిష్కారానికి కాన్సస్ కాంగ్రెస్ సభ్యుడుతో పాటు మరికొందరు ముందుకు వచ్చారు. త‌ద్వారా ఆమెకు పెద్ద ఉపశ‌మ‌నం ద‌క్కింది.

కాగా, శ్రీ‌నివాస్ సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి తెలిపిన జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వారి మ‌ధ్య అన్యోన‌త‌ను చాటిచెప్పిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. మార్చి 9వ తేదీన ఆయ‌న పుట్టిన‌రోజు. శ్రీ‌నివాస్ జీవించి ఉంటే ఆ రోజుకు ఆయ‌న వ‌య‌స్సు 33 ఏళ్లు నిండేవి. త‌న భ‌ర్త అంటే ఎంతో మ‌మ‌కారం ఉన్న శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి సున‌య‌న దుమ‌ల ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ మేర‌కు ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్ పెట్టి భ‌ర్త‌పై త‌నకున్న వెల‌క‌ట్ట‌లేని ప్రేమ‌ను చాటుకుంది. "నా ప్రియ‌మైన ప్రేమ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ రూపంలో నీకు శుభాకాంక్ష‌లు చెప్పాల్సి వ‌స్తుంద‌ని అనుకోలేదు. నిన్ను చాలా కోల్పోతున్నాను. కొత్త నివాసంలో నువ్వు చుట్టుపక్క‌ల ఉన్న ఆహ్లాద‌క‌ర‌మైన మ‌నషులు, ప‌రిస్థితుల మ‌ధ్య సంతోషంగా ఉన్నావ‌ని భావిస్తున్నాను. నీ చుట్టూతా ప్రేమ‌ను మాత్ర‌మే పంచే మ‌నుషులు ఉన్నార‌ని భావిస్తున్నాను. నీపై అప‌రిమ‌త ప్రేమ‌ను క‌లిగి ఉన్నాను" అని సున‌య‌న పోస్ట్ చేశారు. కాగా, శ్రీ‌నివాస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌య్యారు. ప్ర‌తి పుట్టినరోజు నాడు త‌మ‌తో మాట్లాడట‌మే కాకుండా వీడియో కాల్ ద్వారా ఆశీస్సులు తీసుకునేవాడ‌ని శ్రీ‌నివాస్ కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న జ‌న్మదినం స‌మ‌యంలో త‌న జ్ఞాప‌కాల‌తోనే ఆ కుటుంబం గ‌డిపేస్తోంది.