Begin typing your search above and press return to search.

క్రికెటర్ షమిపై భార్య సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   7 March 2018 8:03 AM GMT
క్రికెటర్ షమిపై భార్య సంచలన ఆరోపణలు
X
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిపై అతడి భార్య హాసిన్ సంచలన ఆరోపణలు చేసింది. షమికి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని.. అతడిలోని మరో కోణం జనాలకు తెలియదని ఆమె అంది. షమితో పాటు అతడి కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేయడమే కాక చంపడానికి కూడా ప్రయత్నించారని ఆమె ఆరోపించడం గమనార్హం. షమికి.. హాసిన్ కు 2014లో పెళ్లయింది. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉంది. రెండేళ్ల పాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది కానీ.. ఆ తర్వాత ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. ఐతే ఇప్పుడు షమి గురించి హాసిన్ మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో ఆమె ఏమందంటే..

‘‘రెండేళ్లుగా షమితో పాటు అతడి కుటుంబసభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. షమికి ఎంతో మంది అమ్మయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఒక రోజు షమి కారులో మొబైల్‌ ఫోన్‌ దొరికింది. దాన్ని ఓపెన్‌ చేసి చూస్తే చాలా అసభ్యకర సందేశాలు కనిపించాయి. అవన్నీ చదవడానికి నాకు ఒక రాత్రి సరిపోలేదు. అందులో చాలామంది అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. ఓ పాకిస్థాన్‌ అమ్మాయితో షమికి పెళ్లి కూడా అయినట్లు వెల్లడైంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ అనంతరం షమి ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్‌ కు కూడా వెళ్లినట్లు తెలిసింది. భారత క్రికెట్ జట్టు ఎక్కడికి వెళ్లినా కుల్దీప్‌ అనే వ్యక్తి షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. త్వరలో షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’’ అని హాసిన్ చెప్పింది. తన భార్య ఆరోపణలపై షమి స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం గురించి ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిలో ఏమాత్రం నిజం లేదని.. తన క్రికెట్ కెరీర్ ను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నాడు.