Begin typing your search above and press return to search.

రెండు కుక్కల కోసం కాపురం వద్దనేసింది

By:  Tupaki Desk   |   10 Sep 2015 4:16 AM GMT
రెండు కుక్కల కోసం కాపురం వద్దనేసింది
X
ముద్దుగా.. ముచ్చటగా చూసుకునే భర్త కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే రోజులివి. అయితే.. కుక్కల మోజులో పడిన ఒక అమ్మడు.. మొగుడు వద్దు.. అతగాడితో కాపురం వద్దని చెప్పేయటం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. అలా అని ఈ విచిత్రమైన వ్యవహారం ఏ ప్రాశ్చాత్య దేశంలో జరగలేదు సుమా.

మన పక్కనే ఉన్న బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ చిత్రమైన వ్యవహారాన్ని చూసి.. ఎన్నో వివాదాల్ని పరిష్కరించే పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విచిత్రమైన వ్యవహారంలోకి వెళితే.. బెంగళూరు మహానగరంలోని హెచ్ ఎస్ ఆర్ లేఅవుట్ కు చెందిన ఐటీ ఇంజినీర్.. కేరళకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఏడాది క్రితం జరిగిన పెళ్లి వేడుకల అనంతరం.. పుట్టింటి నుంచి అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి తనతో పాటు రెండు కుక్కల్ని తెచ్చుకుంది. పెళ్లాం కోరికను మొగుడు కాదనలేక.. అమ్మడి ముద్దు ముచ్చటకు ఓకే చెప్పేశారు.

లాబ్రాడర్ జాతికి చెందిన ఈ రెండు పెంపుడు కుక్కలతో కాపురానికి వచ్చేసిన ఆమె.. మెగుడ్ని వదిలేసి కుక్కలతోనే కాలం గడపటం.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కుక్కల మీద అమ్మడి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే.. బెడ్ రూంలో తనతో పాటే కుక్కలు కూడా పడుకోవాలని పట్టుదలతో చెప్పటం మెగుడుగారికి షాక్ తినేలా చేసింది.

ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేయాలో తోచని ఆ కుర్రాడు.. తల్లికి తన వేదనను చెప్పి.. సొల్యూషన్ కోరితే.. కొత్త కాపురం సర్దుకోవటానికి కొంత సమయం పడుతుందని చెప్పి సముదాయించారట. మొత్తానికి కాపురం కథ ఏడాది గడిచింది. అయినప్పటికీ మొగుడు మీద కించిత్ ప్రేమ సంగతి తర్వాత.. కుక్కల మీద అభిమానం మరింత పెరిగిందట. దీంతో.. విసుగు చెందిన భర్త.. నేను కావాలా? కుక్కలు కావాలా? తేల్చుకో అంటే.. మారు మాట్లాడకుండా కుక్కలు కావాలంటూ చెప్పేయటంతో భర్తగారి నోట మాట రాని పరిస్థితి.

అప్పటివరకూ నాలుగు గోడల మధ్య నడిచిన వ్యవహారం.. బజారు కెక్కింది. పోలీస్ స్టేషన్.. కౌన్సిలింగ్ సెంటర్లు అంటూ పలు వేదికలకు సీన్ వెళ్లింది. ప్రతిచోటా.. వీరి వ్యవహారం విని విస్మయం చెందేవారే. తమ శాయశక్తులా ప్రయత్నించినా.. అమ్మడ్ని మార్చటం కష్టం కావటంతో.. తామేమీ చేయలేమని.. కోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు విడాకులు తీసుకొని ఎవరికి వారు బతికేయాలని ఇద్దరూ నిర్ణయించుకోవటం గమనార్హం. కాకుంటే.. న్యాయస్థానం ఏం చెబుతుందా? అన్నది ఇప్పుడు వారి మధ్య ప్రశ్నగా మారింది. కోర్టు కానీ ఓకే చెప్పేస్తే. ఎవరికి వారు తట్టాబుట్టా సర్దుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.