Begin typing your search above and press return to search.

సుప్రీం సంచలనం:వేరు కాపురం అంటే విడాకులే

By:  Tupaki Desk   |   8 Oct 2016 6:11 AM GMT
సుప్రీం సంచలనం:వేరు కాపురం అంటే విడాకులే
X
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. విడాకుల ఇచ్చే విషయంలో మరో కొత్త అంశానికి చోటు దక్కింది. కని.. పెంచి.. కష్టపడి చదివించిన తల్లిదండ్రుల్ని వదిలేసి విడిగా కాపురం పెట్టాలని ఒత్తిడి చేసే భార్యలకు చెంపపెట్టులాంటి తీర్పు ఒకటి ఇచ్చింది. తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరుగా ఉండాలంటూ భార్యలు కానీ బలవంతం చేస్తున్నా.. ఇబ్బంది పెడుతున్నా.. వారితో విడిపోయేందుకు భర్తలకు అవకాశం ఇచ్చేలా సరికొత్త తీర్పునిచ్చింది.

మొగుడు కావాలి.. మొగుడు తెచ్చు సంపాదన.. పేరు ప్రఖ్యాతులు కావాలి కానీ.. అతడ్ని అంతవాడ్ని చేసిన తల్లిదండ్రులు వద్దంటే వద్దని కరాఖండిగా చెప్పే భార్యలకు షాక్ ఇచ్చేలా సుప్రీం తీర్పునిచ్చింది. భర్తను తల్లిదండ్రుల నుంచి దూరం చేయటాన్ని క్రూరత్వమే అవుతుందని.. అలాంటప్పుడు విడాకులు కోరవచ్చంటూ సుప్రీంకోర్టు జస్టిస్ ఏఆర్. దవే.. జస్టిస్ లావు నాగేశ్వరరావుల దర్మాసనం తేల్చింది.

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన భార్య పెడుతున్న ఇబ్బందులతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కిందికోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది. అయితే.. 2001లో కర్ణాటక హైకోర్టు మాత్రం కింది కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదంటూ పేర్కొంటూ నిర్ణయాన్ని వెల్లడించింది. వేరు కాపురం పెడదామని భార్య అడిగితే తగిన కారణం ఉండి తీరాలన్న ధర్మాసనం.. అందుకు భిన్నంగా ఒత్తిడి చేసే వారితో వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు చట్టం అనుమతించేలా తీర్పు వెలువరించటం గమనార్హం. వేరుగా ఉందామని అనటం మన సంస్కృతి.. విలువలకుదూరం కావటమేనని.. ప్రాశ్చాత్య ధోరణిగా పేర్కొన్న కోర్టు.. ఇలాంటి విషయాల్లో విడాకులు పొందిన భార్యకు భర్త నుంచి పరిహారం పొందే హక్కు కూడా లేదని పేర్కొంది. కని.. పెంచి.. చదివించిన తల్లిదండ్రుల బాగోగుల్ని చూడటం కుమారుడి నైతిక బాధ్యతగా ధర్మాసనం పేర్కొంది. మరీ.. తీర్పు ప్రభావం వేరు కాపురం కోసం వేధించే భార్యల మీద ఎంత ఉంటుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/