Begin typing your search above and press return to search.

వీకీలీక్స్ ఉచ్చులో ఒబామా

By:  Tupaki Desk   |   22 Oct 2016 9:31 AM GMT
వీకీలీక్స్ ఉచ్చులో ఒబామా
X
ప్ర‌పంచ స్థాయి నేత‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన వీకీలీక్స్ తాజాగా మ‌రో సారి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. సాక్షాత్తూ అమెరికా అధ్య‌క్షుడు ఒబామాపై గురిపెట్టి మ‌రీ సంచ‌ల‌నాన్ని పేల్చింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వీకీలీక్స్ అధినేత అసాంజే.. త్వ‌ర‌లోనే అమెరికాకు దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తాన‌ని చెబుతూ వ‌చ్చాడు. ముఖ్యంగా డెమొక్ర‌టిక్‌ అభ్యర్థిగా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన హిల్ల‌రీకి షాక్ త‌ప్ప‌దు అన్న‌ట్టుగా మాట్లాడారు. అనుకున్న‌దే త‌డ‌వుగా మ‌రికొన్ని రోజుల్లోనే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముహూర్తం స‌మీపిస్తోంద‌న‌గానే అసాంజే తాజాగా పేల్చిన బాంబు సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది.

విదేశాంగ‌శాఖ మాజీ మంత్రి అయిన హిల్ల‌రీ ఇప్ప‌టికే ప్రైవేటు ఈ మెయిళ్ల కుంభ‌కోణంలో చిక్కుకుని నానాతిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఒబామాకు చెందిన ప్రైవేటు ఈ మెయిళ్ల‌ను అసాంజే బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఒబామాకు చెందిన ఏడు ఈ-మెయిల్స్‌ ను వికీలీక్స్ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. వీటిలో ప‌లు కీల‌క విష‌యాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు ఈ-మెయిళ్ల‌లో జి-20 సమావేశాలకు వెళ్లకూడ‌దంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా టీమ్‌ లోని జాన్‌ పొడెస్టా పంపిన మెయిల్ పెను దుమార‌మే రేప‌నుంది. అప్ప‌ట్లో త‌లెత్తిన‌ ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై కీల‌క అంశాల‌ను చ‌ర్చించేందుకు ఆ స‌ద‌స్సును ఏర్పాటు చేశారు.

ఒబామా ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా ఎన్నికైన రోజు ఆయన‌ను జార్జి డబ్ల్యూ బుష్ ఆ స‌ద‌స్సుకు ఆహ్వానించారు. ఇంత‌లో పొడెస్టా.. ఓ మెయిల్ పంపారు. దీనిలో ఆ స‌ద‌స్సుకు వ‌ద్ద‌ని సూచించారు. దీంతో త‌న పార్టీ నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ను ఒబామా త‌ల‌కెక్కించుకుని జీ 20 స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారు. ఇది అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, ఇప్పుడు ఈ మెయిల్ వ్య‌వ‌హారాన్ని అసాంజే వెల్ల‌డించారు. దీంతోపాటు ప‌లు కీల‌క మెయిళ్ల‌ను కూడా బ‌య‌ట‌పెట్టారు. దీంతో హిల్ల‌రీ భ‌విత‌వ్యంపై నీలినీడ‌లు క‌మ్ముకునే ప్ర‌భావం ఉంద‌ని విశ్లేష‌కుల భావ‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి అమెరికాపై అసాంజే త‌న ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడ‌న్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/