Begin typing your search above and press return to search.

తిరుమల వీధుల్లో వన్యప్రాణుల సంచారం !

By:  Tupaki Desk   |   23 April 2020 6:00 AM GMT
తిరుమల వీధుల్లో వన్యప్రాణుల సంచారం !
X
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్‌ డౌన్ ను విధించింది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేసింది. స్వామివారికి ఏకాంతంగా సేవలను నిర్వహిస్తున్నారు. దీంతో తిరుమలలో 128 ఏళ్ల నాటి వాతావరణం కన్పిస్తోందని స్థానికులు చెబుతున్నారు. మరో వైపు భక్తుల రాకపోకలు లేకపోవడంతో , తిరుమల కొండ పై నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా టీటీడీ శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు అనుగుణంగా భక్తులకు,శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. గత నెల రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు నిలిచిపోయింది. దీంతో తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డుతో పాటు తిరుమలలో వీధుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న కారణంగా ఆ రోడ్డులో వన్య మృగాలు సంచరిస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కళ్యాణ వేదిక , శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుతపులి సంచరించింది. చిరుతతో పాటు ఎలుగు బంటి కూడ సంచరించినట్టుగా అటవీశాఖ చిరుతపులి, ఎలుగుబంటి తిరుమల వీధుల్లో సంచరించిన దృశ్యాలను సీసీకెమెరాలు రికార్డు చేశాయి.

బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్ లో చిరుతపులి, అడవి పందులు, దుప్పులు సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే శ్రీవారి మాడ విధుల్లో ఇటీవలే వరాహం ఒకటి సంచరిస్తున్న వీడియో బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సాయంత్రం పూట జనం ఎవరూ కూడ బయట తిరగకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విషయం లో తీసుకునే నిర్ణయాన్ని బట్టి తిరుమల శ్రీవారి తెరిచే విషయమై టీటీడీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఏదేమైనా ఘాట్ రోడ్డులో వాహన శబ్దలు లేకపోవడంతో జంతువులూ యదేచ్ఛగా తిరుగుతున్నాయి.