Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోంలో కేసు నమోదు చేయనున్నారా?

By:  Tupaki Desk   |   15 Feb 2022 2:30 PM GMT
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అసోంలో కేసు నమోదు చేయనున్నారా?
X
దేశంలో చాలా పార్టీలు ఉన్నా.. తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ కాస్త భిన్నమైన రాజకీయ పార్టీగా చెప్పక తప్పదు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలు పెట్టి.. రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినట్లుగా స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆరే చెబుతుంటారు. దీనికి తగ్గట్లే.. రాజకీయ పార్టీగా మారిన తర్వాత కూడా ఉద్యమ పార్టీ లక్షణాలు టీఆర్ఎస్ పరివారాన్ని మిస్ కాలేదని చెప్పాలి.

ఏదైనా జరిగిన వెంటనే.. టీఆర్ఎస్ కు చెందిన వివిధ విభాగాలు ఎలా రియాక్టు అవుతాయన్న విషయం తెలిసిందే. తమ పార్టీని.. అధినేతను ఇరుకున పెట్టే వారి విషయంలో అనుసరించే తీరు మిగిలిన పార్టీలకు భిన్నంగా ఉంటుంది.

గులాబీ దండు మాదిరే అసోం కమలనాథులు.. వారి పరివారం వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ మీద కామెంట్లు చేయటం తెలిసిందే.

దీనిపై అసోం బీజేపీ నేతలు స్థానిక పోలీసులు కంప్లైంట్ చేయటం గమనార్హం. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జికల్ స్ట్రెయిక్స్ మీద ఆధారాలు కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని.. సైనికుల ధైర్యసాహసాల్ని తక్కువ చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా వారు ఆరోపిస్తున్నారు.

దీంతో.. తమకు అందిన ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసు నమోదు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ అయిన ఏఎన్ఐ పేర్కొంది. మరోవైపు సర్జికల్ స్ట్రైక్స్ మీద తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసోం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు.

భారత సైన్యం ధైర్య సాహసాల మీద ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. అలాంటి వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని పేర్కొన్న ఆయన.. సైన్యంపై మంచి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారన్నారు. సర్జికల్ స్ట్రెయిక్ మీద ఆధారాలు అడిగిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ మాదిరే తాను కూడా అడుగుతానని పేర్కొనటం.. తనకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ పొలిటికల్ స్టంట్ అని దేశంలో సగం మంది నమ్ముతున్నారని.. అందులో నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు అసోం బీజేపీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. మరి.. అసోం పోలీసులు ఏం చేస్తారో చూడాలి.