Begin typing your search above and press return to search.

ఈ హెచ్చరికలకు మాత్రం తక్కువ లేదు

By:  Tupaki Desk   |   28 July 2015 4:31 AM GMT
ఈ హెచ్చరికలకు మాత్రం తక్కువ లేదు
X
‘‘దేశ ప్రతిష్ఠకు సవాలు విసిరితే గట్టి జవాబిస్తాం. పొరుగుదేశంతో మేం సత్సంబంధాలను కోరుకుంటుంటే.. సీమాంత ఉగ్రవాద ఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మేం శాంతిని కోరుకుంటున్నాం. అయితే.. అందుకోసం దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టబోమని పొరుగుదేశానికి చెప్పదలుచుకున్నా’’ అంటూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఉగ్రవాద ఘటనలు కానీ.. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం కానీ.. పాకిస్థాన్ కు అలవాటే. అలా హద్దులు దాటిన ప్రతిసారీ.. మా సత్తా చూపిస్తాం.. తాట తీస్తాం లాంటి వ్యాఖ్యలు చేయటం తప్పించి.. పాక్ కి బుద్ధి వచ్చేలా.. భారత్ తో పెట్టుకుంటే ఇబ్బందే సుమి అన్నట్లు వ్యవహరించే విషయంలో యూపీఏ కానీ ఎన్డీయే కానీ ఒకే దారిన నడుస్తున్నాయని అనిపించక మానదు.

మోడీ కానీ ప్రధాని అయితే.. పాకిస్థాన్ కు భారత్ సత్తా ఏంటో చూపిస్తారు? మౌన సింగ్ మాదిరి చేతులు కట్టుకొని కూర్చోరు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా విషయం ఉంటుంది. చేతకాని వారి చేతుల్లో దేశం ఉంటే ఉగ్రవాద దాడులు కాకుండా ఇంకేం జరుగుతాయన్న మాటలు తరచూ వినిపించేవి. మౌన సింగ్ ప్రధానిగా ఉన్నా.. మోడీ ప్రధానిగా ఉన్నా జరగాల్సిన ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో తీవ్రంగా స్పందించటం.. హెచ్చరించటం లాంటి పదాలతో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఉపయోగించటం జరుగుతున్నాయి. వ్యక్తులు మారినా.. మార్పు మాత్రం లేదన్న దానికి తాజాగా రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యలే నిదర్శనం.