Begin typing your search above and press return to search.

అఖిలేష్ ప్రకటన రివర్సవుతుందా ?

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:35 AM GMT
అఖిలేష్ ప్రకటన రివర్సవుతుందా ?
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వేడి బాగా రాజుకుంటోంది. దీనికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనే నిదర్శనం. నోయిడాలో జరిగిన ప్రచారంలో అఖిలేష్ మాట్లాడుతూ ఎస్పీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై విచారణ చేస్తామని ప్రకటించారు. అఖిలేష్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పైన అనేక అభియోగాలున్నాయని అఖిలేష్ చెప్పారు.

ఎస్పీ అధికారంలోకి రాగానే ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజంగానే ఎస్పీ అధికారంలోకి వస్తే యోగి పై ఫిర్యాదు చేయటం పెద్ద విషయమేమీ కాదు. మిగిలిన విషయాలను పక్కన పెట్టేసినా లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయడంలో మాత్రం యోగి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. ఎస్పీ హయాంలో పేట్రేగిపోయిన మాఫియాలను యోగి ప్రభుత్వం చాలావరకు అణచివేసింది.

వందల సంఖ్యలో గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్ చేసేసింది. మరికొన్ని వేలమంది ఎన్ కౌంటర్లకు భయపడి రాష్ట్రం వదిలి పారిపోవటమో లేకపోతే తమంతట తామే సరెండర్ అయిపోవటమే జరిగింది. జైళ్ళల్లో ఉంటున్న గ్యాంగ్ స్టర్లలో చాలామంది బెయిల్ తీసుకోవటానికి కూడా భయపడుతున్నారు. బెయిల్ తీసుకుని బయటకు వస్తే ఎక్కడ తమను ఎన్ కౌంటర్ చేసేస్తారో అని భయంతో జైళ్ళల్లోనే కూర్చుంటున్నారు.

గ్యాంగ్ స్టర్ల దెబ్బకు ఆస్తులు, ప్రాణాలను పోగొట్టుకున్న వేలాది హిందూ కుటుంబాలు తిరిగి తమ సొంతూళ్ళకు వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న రాష్ట్రంలో యోగిపై విచారణ జరిపిస్తామని, చర్యలు తీసుకుంటామని అఖిలేష్ ప్రకటించారు. మరి అఖిలేష్ చేసిన ప్రకటన ఎస్పీకి వర్కవుటవుతుందా ? అనేది చూడాలి. ఎందుకంటే కేవలం లా అండ్ ఆర్డర్ కారణంగానే యోగి ప్రభుత్వానికి మద్దతిస్తున్న దిగువ, మధ్య తరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇపుడు యోగిపై విచారణంటే వాళ్ళంతా అంగీకరిస్తారా ?