Begin typing your search above and press return to search.

ఆలీది పార్టీ ఓకే.. సీటు ఎక్కడ..?

By:  Tupaki Desk   |   26 Feb 2019 4:58 AM GMT
ఆలీది పార్టీ ఓకే.. సీటు ఎక్కడ..?
X
ఇప్పటి వరకు సిల్వర్‌ స్క్రీన్‌ మీద నవ్వులు పూయించిన సినీ నటుడు ఆలీ ఇక రాజకీయ తెరపై సై అనడానికి రెడీ అవుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఆలీ ఎన్నికల బరిలో ఉంటాడన్న విషయం వాస్తవమే అయినా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార్న సస్పెన్స్‌ కొనసాగింది. చివరకు ఆలీ టీడీపీ నుంచే పోటీలో ఉంటాడని క్లారిటీ వచ్చింది. అలీ 20 ఏళ్ల క్రితమే టీడీపీలో చేరారు. అయితే అప్పుడు ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు. ఆ తరువాత టీడీపీతో పెద్దగా టచ్‌ లో లేడు. ఇటు వైసీపీ, అటు టీడీపీ రెండు పార్టీలు కూడా రా రమ్మని పిలుస్తున్న వేళ టీడీపీలో చేరారు.

టీడీపీ నుంచే పోటీ చేస్తారని చెప్పిన ఆలీ తన స్థానం గురించి చంద్రబాబే డిసైడ్‌ చేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గ నాయకుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని రకరకాలుగా కామెంట్లు చేసుకుంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 37 వేల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మద్దాలి గిరి బరిలో దిగితే వైసీపీ నుంచి పోటీ చేసిన ముస్తఫా విజయం సాధించారు.

గుంటూరు తూర్పులో టీడీపీకి బలమైన నాయకుడు లేరు. ఒకవేళ చంద్రబాబు గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్లింకే ఇవ్వాలని డిసైడ్‌ అయితే ఆలీకీ ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ నియోజకవర్గ టికెట్‌ మళ్లీ మద్దాలి గిరికే కేటాయిస్తే ఆలీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది.ఈ నియోజకవర్గంలో కూడా ముస్లిం ఓటు బలంగా ఉంది. మొదటి నుంచి ఆలీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీదే ఫోకస్‌ పెట్టాడట. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా జలీల్‌ ఖాన్‌ ఉన్నారు. ఇప్పటికే తన కుమార్తెను ఎన్నికల రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ ను తన కుమార్తె షబానాకు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారని జలీల్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

అయితే ఆలీని గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయిస్తాడా..? లేక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ ఇస్తారా..? అనే చర్చ నాయకుల్లో మొదలైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ ఇస్తే ఆలీ ఏపీ మొత్తం ఫోకస్‌ అవుతాడని, అలాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లతో ఆలీ నెట్టుకురాగలడని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండా విశాఖ సౌత్‌ నుంచి కూడా ఆలీకి ఛాన్స్‌ ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి రెండుసార్లు ముస్లిం నేతలు గెలిచారు. మరోవైపు ఈ అసెంబ్లీలో ఉుత్తర కోస్తా నుంచి ఒక్కముస్లిం ఎమ్మెల్యే కూడా లేడు. ఈసారి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ముస్లిం సంఘాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయట. దీంతో విశాఖ సౌత్‌ లేదా విశాఖ నార్త్‌ లో ఏదో ఒకటి ఆలీకి ఇవ్వొచ్చని అనుకుంటున్నారట. అయితే ఆలీ మనసులో ఏ నియోజకవర్గం ఉందో తెలియాల్సి ఉంది.