Begin typing your search above and press return to search.

యూపిలో కూడా పోటీ రెడీ

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:55 AM GMT
యూపిలో కూడా పోటీ రెడీ
X
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మజ్లిస్ పార్టీ రెడీ అయిపోతోంది. ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతు యూపి అసెంబ్లీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. దశాబ్దాల పాటు కేవలం హైదరాబాద్ అందులోను పాతబస్తీకి మాత్రమే ఎంఐఎం పార్టీ పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది మెల్లిగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు అసద్ జాగ్రత్తగా వ్యూహాలు పన్నుతున్నారు.

ఇందులో భాంగంగానే మహారాష్ట్రలో పోటీచేశారు. అక్కడ నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలిచింది పార్టీ. ఆ తర్వాత గుజరాత్ లో పోటీ చేశారు కానీ ఉపయోగం లేకపోయింది. ఈమధ్యనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 చోట్ల పోటీచేసింది. కీలకమైన 5 నియోజకవర్గాల్లో గెలిచింది. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో 25 సీట్లలో పోటీచేసినా ఉపయోగం కనబడలేదు. అయితే ఇతర పార్టీల ఓట్లను గణనీయంగా చీల్చింది.

ఈమధ్యనే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీచేసింది. అయితే ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పార్టీ దృష్టి తాజా ఉత్తరప్రదేశ్ మీద పడింది. ఏకంగా 100 నియోజకవర్గాల్లో పోటీ చేయటమంటే మామూలు విషయం కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ రాష్ట్రంలో పోటీచేసినా ముస్లింల ఓట్లు, ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నది.

అంటే ముస్లింలు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయంలో ముందుగానే స్పష్టమైన సర్వే చేయించుకుని ఎంఐఎం ఎన్నికల్లోకి దిగుతోంది. వీలైతే ఎన్నికల్లో గెలవటం లేకపోతే ప్రత్యర్ధి పార్టీలను గట్టిగా దెబ్బకొట్టడమే టార్గెట్ గా అసదుద్దీన్ పావులు కదుపుతున్నారు. ఇందులో వీలైతే స్ధానికంగా ఉన్న ముస్లింపార్టీలు లేదా ఇతర పార్టీలతో కూడా జత కడుతున్నారు. రేపు యూపీ ఎన్నికల్లో సుహెల్దేవ్ సమాజ్ వాదీపార్టీ నేతృత్వంలోని భాగిదారి సంకల్ప్ మోర్చా కూటమితో కలిసి పోటీ చేయబోతున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. మరి యూపిలో అదృష్టం ఎలాగుంటుందో చూడాలి.