Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకోండి.. షా అలా కంటిన్యూ అవుతుంటారు!

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:08 AM GMT
రాసి పెట్టుకోండి.. షా అలా కంటిన్యూ అవుతుంటారు!
X
రూల్ అంటే రూల్ అన్న‌ట్లే ఉండాలి. ఒక‌రికి ఒక రూల్.. మ‌రొక‌రికి మ‌రో రూల్ అన్న‌ది ఎక్క‌డా ఉండ‌దు. కానీ.. కొన్ని సంద‌ర్భాల్లో రూల్స్ మారిపోతుంటాయి. అమిత్ షా లాంటి పెద్దాయ‌న కోసం మ‌నం మ‌న అవ‌స‌రాల కోసం పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్.. అదేనండి స‌డ‌లిస్తే కొంప‌లేమీ మునిగిపోవు క‌దా?

ఆద‌ర్శాలు.. సిద్ధాంత‌ల విష‌యంలో క‌ఠినంగా ఉంటామ‌ని చెప్పే బీజేపీలోనూ కాంగ్రెస్ పోక‌డ‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మోడీ నీడ లాంటి అమిత్ షా కోసం పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ అనుస‌రిస్తున్న రూల్స్ ను చాలావ‌ర‌కు బ్రేక్ చేయ‌టం తెలిసిందే. తాజాగా మ‌రో రూల్ ను బ్రేక్ చేసే నిర్ణ‌యాన్ని తీసేసుకున్నారు.

పార్టీ నిబంధ‌న‌ల ప్ర‌కారం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపికైన వారు మూడేళ్లు ఉంటారు. ఎవ‌రైనా కీల‌క స్థానాల్లో ఉన్న నేత‌.. ముఖ్య‌మైన ప‌ద‌విని చేప‌ట్టిన‌ప్పుడు.. ఒక వ్య‌క్తికి రెండు ప‌దవులు ఉండ‌టం స‌రికాదు కాబ‌ట్టి.. ఏదో ఒక దానిని వ‌దిలేస్తుంటారు. రాజ్ నాథ్ సింగ్ లాంటోడే.. అందుకు మిన‌హాయింపు కాద‌న్న మాట పార్టీ చెప్పింది.

కానీ.. అమిత్ షా విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం చూస్తే.. స‌మానుల్లో ప్ర‌ధ‌ముడు షా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కేంద్ర హోం మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే క్ర‌మంలో పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న రాజ్ నాథ్‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ స‌మ‌యంలో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు అమిత్ షా.

తాజాగా కేంద్ర హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న షా.. తాజాగా త‌న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దులుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయ‌కుండా.. ఆ ప‌ద‌విలో మూడు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కూ కంటిన్యూ కావాల్సిందిగా కోరుతూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. కొద్ది నెల‌ల్లో మ‌హారాష్ట్ర.. ఢిల్లీ.. హ‌ర్యానా.. జార్ఖండ్‌.. రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. అవి పూర్తి అయ్యే వ‌ర‌కూ పార్టీ అధ్య‌క్ష స్థానంలో అమిత్ షా ఉండాల‌ని డిసైడ్ చేశారు.

వాస్త‌వానికి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం గ‌త డిసెంబ‌రులోనే పూర్తి అయ్యింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం పొడిగించారు. తాజాగా మ‌రోసారి పొడిగించ‌టం ద్వారా షాను మార్చే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్న విష‌యాన్ని పార్టీ చెప్పేసింద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సంద‌ర్భంగా షా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన‌ప్ప‌టికి బీజేపీ ఇంకా శిఖ‌రాగ్రానికి చేరుకోలేద‌న్న మాట అమిత్ షా నోటి నుంచి వ‌చ్చిందంటే.. దానికి అర్థం.. అలాంటి ప‌రిస్థితికి పార్టీ వెళ్లే వ‌ర‌కూ తాను పార్టీ అధ్య‌క్ష కుర్చీని వ‌దిలి వెళ్ల‌న‌ని చెప్ప‌ట‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ మొత్తం మోడీషా క‌నుస‌న్న‌ల్లోకి వెళ్లిపోయిన నేప‌థ్యంలో.. వారిరువురు పార్టీకి సంబంధించి కీల‌క బాధ్య‌త‌లు మ‌రెవ‌రికీ అప్ప‌గించే ప‌రిస్థితి లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు తాజా ఎపిసోడ్ మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.