Begin typing your search above and press return to search.

ఆనం.. మంత్రి అయ్యేదే లేదా?

By:  Tupaki Desk   |   13 March 2022 2:30 PM GMT
ఆనం.. మంత్రి అయ్యేదే లేదా?
X
నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి మంత్రి ప‌ద‌వి ఆశ‌లు గల్లంత‌యిన‌ట్లేనా? అందుకు సొంత పార్టీ నేత‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌తే కార‌ణ‌మా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే మంత్ర‌విర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే ముహూర్త‌మే ఎప్పుడు అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వుల‌పై చాలా మంది నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. వాళ్ల‌లో ఆనం కూడా ఒక‌రు. కానీ ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా చేస్తుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌ర‌ణంతో ఆనంలో ఆశ‌లు మ‌రింత పెరిగాయ‌ని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గం కోటాలో త‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న అనుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆనం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆనం కుటుంబానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌పుడు ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు. అయితే జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీని స్థాపించిన‌ప్పుడు ఆనం కుటుంబం కాంగ్రెస్‌లోనే కొన‌సాగింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీడీపీలో చేరింది.

నెల్లూరు నుంచి ఆనంతో పాటు న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, గోవ‌ర్ధ‌న్ రెడ్డి త‌దిత‌ర నేత‌లు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల జిల్లాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఆనం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతో పాటు ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలోని మిగ‌తా వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌, కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఆనంకు వ్య‌తిరేకంగా ఉన్నారు.

నెల్లూరు జిల్లాలో ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌ను గాను ఏడింట్లో రెడ్డి నేత‌లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ల‌లో అత్య‌ధిక శాతం ఆనంను వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆనంకు ఈ సారి కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.