Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. సమస్యలు పరిష్కారమయ్యేనా?

By:  Tupaki Desk   |   11 Nov 2021 8:39 AM GMT
ఎట్టకేలకు దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. సమస్యలు పరిష్కారమయ్యేనా?
X
పీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు నాన్చుడు ధోరణిని అవలంభిస్తుండటంతో ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు గట్టిగా ఉండటంతో ప్రభుత్వం వారిని నేడు చర్చలకు ఆహ్వానించింది. ఎనిమిదేళ్లుగా తమకు ప్రభుత్వం పీఆర్సీని ప్రభుత్వాలు పెంచలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం శోచనయంగా మారింది.

ఈ విషయంలోనే ఉద్యోగ జేఏసీ నాయకులు, ఉద్యోగులు నిన్న ఏపీ సచివాలయంలో నిరసన చేపట్టారు. సుమారు ఐదుగంటలపాటు ఉద్యోగ సంఘం నేతలు సెక్రటేరియట్‌లోనే బైఠాయించారు. పీఆర్సీపై క్లారిటీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. పే రివిజన్ జరిగి ఎనిమిదేళ్లు దాటిపోతుందని అయినా ప్రభుత్వంలో చలనం లేదంటూ వారంతా మండిపడ్డారు.

ప్రభుత్వం 11వ పీఆర్సీ రిపోర్టును వెంటనే బయటపెట్టాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలతో ఓట్లేసీ సీఎంను గెలిస్తే తమ సమస్యలను ప్రశ్నించుకోరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. అలాగే ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సైతం ఉద్యోగ జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఉద్యోగులు ఎలా బ్రతికేది అంటూ ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, సీఎస్ సమాధానం ఇవ్వాల్సినంటూ డిమాండ్ చేశారు. సాయంత్రం 5గంటల వరకు నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు ఆ తర్వాత వెనుదిగారు. ఈక్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలకు పూనుకుంది.

ఈమేరకు సచివాలయ ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు జేఏసీ నేతలకు జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ ఫోన్ చేసినట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో భేటి కానుంది. దీంతో జేఏసీ నాయకులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ చర్చలు ఫలించాక పోతే మాత్రం సాయంత్రం ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో చర్చలు ఫలిస్తాయా? లేదా అన్న ఉత్కంఠత నెలకొంది.