Begin typing your search above and press return to search.

మాధవుడిలా ‘బండి’ దూసుకెళ్తారా?

By:  Tupaki Desk   |   12 July 2020 8:10 AM GMT
మాధవుడిలా ‘బండి’ దూసుకెళ్తారా?
X
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు కలిసొచ్చే ప్రతీ అంశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. కేంద్రంలో బీజేపీ అధికారం ఉండటాన్ని ఆ పార్టీనేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కిందటి ఎన్నికల వరకు అంతగా బలంగాలేని బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకొని సత్తాచాటింది. తెలంగాణలోనూ బీజేపీ బలపడే అవకాశం ఎక్కువగా ఉండటంతో అధిష్టానం పెద్దలు ఇక్కడ ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ నియామకం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు మంచి సపోర్టు ఇస్తుంది. దీంతో నేతలంతా అధికార పార్టీని దూకుడుగా ఎదుర్కొంటున్నారు. పలువురు జాతీయ నేతలు సైతం అప్పుడప్పుడు తెలంగాణలో పర్యటిస్తూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఫైర్ బ్రాండ్ రాంమాధవ్ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు ఐదు స్థానాలు అప్పగిస్తే మూడింట్లో కాషాయ జెండా రెపరెపలాడింది. రాంమాధవ్‌ వ్యూహాలు తెలంగాణలో వర్కౌటవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఆయన ప్రతీసారి తెలంగాణ రాజకీయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే దానిని కంటిన్యూ చెయ్యడంలో గత నాయకత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి.

బండి సంజయ్ బీజీపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక ఆయన కూడా దూకుడుగా వెళుతున్నారు. తాజాగా పార్టీ వర్చువల్‌ ర్యాలీల్లో భాగంగా తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి, టీఆర్ఎస్ ఉలిక్కిపడేలా విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూనే స్థానిక నేతల్లో జోష్ నింపేలా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం గులాబీ నేతలపై కాకరేపే కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాధవ్ రూట్లోనే బండి సంజయ్ సైతం టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వెళుతూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికార పార్టీని సమర్థంగా ఎదుర్కొని తెలంగాణలో బీజేపీ బలపడాలని యోచిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.