Begin typing your search above and press return to search.

వెంకయ్యనాయుడు కోరికను బీజేపీ తీరుస్తుందా..?

By:  Tupaki Desk   |   18 Nov 2021 6:32 AM GMT
వెంకయ్యనాయుడు కోరికను బీజేపీ తీరుస్తుందా..?
X
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల సౌత్ పర్యటనల్లో బిజీగా మారారు. మొన్న సొంత జిల్లా నెల్లూరులో పర్యటించిన ఆయన నిన్న హైదరాబాద్ కు వచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రముఖులను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయితే బాగుంటుందని అన్నారు. దీంతో మెగా హీరో మద్దతు వెంకయ్యనాయుడుకు మద్దతిచ్చినట్లయింది. అయితే కొన్ని రోజుల కిందట చిరంజీవి తమ్ముడు నాగబాబు రతన్ టాటా కు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలని కోరారు. అన్నదమ్ముల వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్రపతి పోస్టుపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

నెల్లూరులో వెంకయ్యనాయుడు పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. తనకు నేరుగా ప్రజా సేవ చేయాలని ఉందని, ప్రజలతో మమేకమై ఉంటేనే ఆనందంగా ఉంటుందని అన్నారు. ఇప్పుడున్న ఉప రాష్ట్రపతి పదవి తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా తెలిపారు.

అయితే ఇదే సమయంలో ప్రజలు తనను రాష్ట్రపతిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి కావాలన్న ఆకాంక్ష మదిలో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అనునాయులు రాష్ట్రపతి కావాలని కోరుతున్నారు.

వచ్చే సంవత్సరం రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో ఆసక్తికరంగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ కు చెందిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నారు.

అయితే ఆయనపై బీజేపీకి ఉన్న మంచి అభిప్రాయంతో పణబ్ ను చివరి వరకు కొనసాగించారు. ఆ తరువా ఎవరూ ఊహించని విధంగా పార్టీలో లేని వ్యక్తి రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి కావాలని చాలా మంది పార్టీ నాయకులే కోరుతారు. కానీ బీజేపీ వ్యూహంలో భాగంగా దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను నియమించి కొన్ని విమర్శల నుంచి తప్పించుకుంది.

ఇక రాజకీయ మార్పుల నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయడుకు ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఇష్టం లేదని, బలవంతంగా ఈ పోస్టును కట్టబెట్టారని కొందరు అంటుంటారు.

కానీ ఇన్ని రోజులు ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ప్రజల్లో సేవ చేయాలని చెబుతూనే రాష్ట్రపతిగా ప్రజలు చూడాలని అన్నారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి కోసం చూస్తున్నారా..? రాష్ట్రపతి పదవి ఆశిస్తున్నారా..? అని చర్చించుకుంటున్నారు.

ఉన్నత పదవుల విషయంలో కేంద్రంలో ఊహించిన విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పార్టీలో ఎక్కువ పరిచయం లేని వారికి ఉన్నత పదవులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా రాష్ట్రపతి విషయంలో కేంద్రం ఓ అంచనాకు వచ్చినట్లే తెలుస్తోంది.

అయితే పార్టీలోని వ్యక్తులకు కాకుండా ఇతర రంగాల్లో ప్రముఖులకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తున్నారు. 2002లో అటల్ బీహార్ వాజ్ పేయి సమయంలోనూ ఎవరూ ఊహించని విధంగా అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేశారు. ఆయన శాస్త్రవేత్తగా అందరికీ పరిచయమే. కానీ ఏ పార్టీలోనూ చేరలేదు. దీంతో ఆయన ప్రతిభను గుర్తించి రాష్ట్రపతిని చేశారు.

ఇప్పుడు కూడా బీజేపీ అదే ఆలోచిస్తుందని కొందరు పార్టీలోని ముఖ్యులు అంటుంటారు. అయితే నాగబాబు ట్విట్టర్ ద్వారా ‘రతన్ టాటా’ కు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇటీవల రతన్ టాటా తన సంపాదనలో సగం ప్రజా సేవకే ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆయన భారత దేశానికి చేసిన సేవలకు గుర్తింపునకు గాను ఆయనకు అవకాశం ఇస్తారా..? అన్న చర్చ సాగుతోంది.