Begin typing your search above and press return to search.

బీజేపీ నేతల కన్ను కశ్మీరీ అమ్మాయిలపై పడిందా?

By:  Tupaki Desk   |   10 Aug 2019 7:00 AM GMT
బీజేపీ నేతల కన్ను కశ్మీరీ అమ్మాయిలపై పడిందా?
X
జమ్మూకశ్మీర్‌ ను మిగతా భారతదేశంతో సమం చేసే క్రమంలో ఆర్థికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ అధికరణం రద్దుతో ఎలాంటి మార్పులు రానున్నాయో ఏమో కానీ కొందరు బీజేపీ నేతల కామెంట్లు చూస్తుంటే కశ్మీరీ అమ్మాయిల కోసం వారు ఉవ్విళ్లూరుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇకపై కశ్మీర్ అమ్మాయిలను సొంతం చేసుకోవచ్చని, వారిని పెళ్లి చేసుకోవచ్చని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు పలువురు నేతలు. తాజాగా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని, ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందంటూ ఆయన అనడం వివాదాస్పదమైంది.

ఖట్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆయన గతంలో ఇలానే స్పందించారు. ఆడామగా మధ్య పరస్పర అంగీకారంతో లైంగింక సంబంధాలు ఏర్పడతాయని.. కానీ, ఇవి జరుగుతాయని, అయితే వారి మధ్య గొడవలు వస్తే అమ్మాయిలు అడ్డం తిరిగి రేప్ కేసులు పెడుతున్నారని అన్నారు. దాదాపు 80-90 శాతం కేసుల్లో ఇదే జరుగుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కూడా కశ్మీర్ యువతుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఇకపై తెల్లని కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని అన్నారు. అంతేకాదు, బీజేపీలోని అవివాహిత నాయకులు కశ్మీర్ వెళ్లి ప్లాట్లు కొనుక్కుని పెళ్లిళ్లు చేసుకోవచ్చని సూచించారు. దీంతో బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే కశ్మీరీ అమ్మాయిల కోసమే బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందా అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు.